హెల్మెట్ తప్పనిసరి
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రయాణించే ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి సంబంధిత శాఖల అధికారులు స్వయంగా పరిశీలించి ప్రమాద నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. కేసులపై కలెక్టర్ సమీక్షిస్తూ సకాలంలో కేసుల వివరాలు సంబంధిత సైట్‌లో నమోదు చేయటం ద్వారా క్షతగాత్రులకు, బాధితులకు బీమా అందేలా చర్యలు తీసుకోవచ్చన్నారు. నేరాలు, దోపిడీలు జరగకుండా హైవేలపై లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారి 65 గురజాడ క్రాసింగ్ అండర్ పాస్ వద్ద లైటింగ్, డ్రెయినేజీ సమస్య పరిష్కరించాలని, అవసరమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. డీఆర్వో కె. చంద్రశేఖరరావు, జిల్లా రవాణాధికారి బీఎస్‌ఎస్ నాయక్, జిల్లా ప్రజారవాణాధికారి వాణిశ్రీ, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంద్ర..
ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రస్థాయి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ప్రజారోగ్య పరిరక్షణ, కాలుష్య ప్రభావాన్ని తగ్గించాలన్నారు. జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, డ్వామా పీడీ ఎన్‌వీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment