No Headline
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వీకెండ్, విశేష పర్వదినాల వేళ అంతరాలయ దర్శనాలపై దుర్గగుడి అధికారులు ఆంక్షలు విధించారు. పండుగ వేళ అంతరాలయ, వీఐపీల రద్దీని నియంత్రించేందుకు దేవస్థాన అధికారులు కార్యాచరణ రూపొందించారు. సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు విచ్చేసిన వారు తిరుగు ప్రయాణంలో అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపించింది. వీఐపీల పేరిట అంతరాలయ దర్శనాలు చేసుకునే వారి సంఖ్య అధికంగా ఉండటం, సామాన్య భక్తులు ఇబ్బందులకు గురి కావడంతో అంతరాలయ దర్శనాలను నిలిపివేయాలని ఈవో రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం కొంత సమయం పాటు అంతరాలయ దర్శనాలు నిలిపివేసి ముఖ మండప దర్శనం మాత్రమే కల్పించారు. ఇకపై శుక్రవారం నుంచి ఆదివారం వరకు.. పండుగలు, విశేష పర్వదినాల వేళ అంతరాలయ దర్శనాలు నిలిపివేయనున్నారు.
ప్రొటోకాల్ దర్శనాలు..
అదే విధంగా ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు, వీఐపీలు, ప్రొటోకాల్ దర్శనాలకు వచ్చే వారు తప్పనిసరిగా ఉదయం 10 గంటల లోపు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల తర్వాతే దర్శనాలకు తీసుకువెళ్లాలని సమాచార కేంద్రంలోని సిబ్బందికి సూచించారు. అంతే కాకుండా ఆ సమయంలో టికెట్ల విక్రయించే కౌంటర్లలో రూ. 500 టికెట్ల విక్రయాలను నిలిపివేయాలని సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. అదే విధంగా పోలీసు, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందికి సూచించారు. ఒక వేళ ప్రొటో కాల్‌పై దర్శనానికి, సిఫార్సులపై వచ్చే వారికి త్వరగా దర్శనం కావాలంటే రూ. 300 క్యూలైన్‌లో అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment