31 వరకు పశు ఆరోగ్య శిబిరాలు
చిలకలపూడి(మచిలీపట్నం): ఈ నెల 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శిబిరాల అవగాహన కార్యక్రమానికి సంబంధించి వాల్‌పోస్టర్లను శుక్రవారం ఆయన విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉచిత పశు ఆరోగ్య శిబిరాల్లో నట్టల నివారణ కార్యక్రమం, వ్యాధి నిరోధక టీకాలు అందజేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 31వ తేదీ వరకు ఈ శిబిరాలు నిర్వహించేందుకు మండలానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మందులు, టీకాలు, నట్టల నివారణ మందులు అన్ని వైద్యశాలల్లో అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి ఎన్‌సీహెచ్ నరసింహులు, డాక్టర్ ఎం. జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.
అన్ని వసతులు కల్పిస్తాం
విజయవాడస్పోర్ట్స్: ఉత్తరాఖండ్‌లో ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 38వ జాతీయ క్రీడలకు రాష్ట్రంలో అర్హత పొందిన క్రీడా జట్లను తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఏర్పాట్లు చేస్తోందని శాప్ గిరిజన క్రీడాధికారి ఎస్.వి.రమణ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ క్రీడల సమయం దగ్గరపడుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై ఈ నెల 17న సాక్షిలో ‘క్రీడలపై సర్కారు సీతకన్ను’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో ఆగమేఘాలపై దస్త్రాలు కదిలాయి. ఎంట్రీలకు సంబంధించి భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) అధికారిక వెబ్‌సైట్ ఈ నెల 13వ తేదీన క్లోజ్ కావడంతో కబడ్టీ, ఖోఖో, అథ్లెటిక్స్ జూడో, ఆర్చరీ క్రీడాకారులు నేరుగా వారి వారి ఫెడరేషన్‌ల ద్వారా ఎంట్రీలను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్.వి.రమణ వెల్లడించారు. 20 క్రీడాంశాల్లో రాష్ట్ర క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉందని, ఒక్కో క్రీడాకారుడికి ట్రాక్ షూట్, జెర్సీ, కిట్, కోచింగ్ క్యాంప్, టీఏ, డీఏల నిమిత్తం రూ.16 వేలను కేటాయించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.
రైల్వేస్టేషన్‌లలో
సీనియర్ డీసీఎం తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు శుక్రవారం తాడేపల్లిగూడెం, తణుకు స్టేషన్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందు కమర్షియల్ అధికారులతో కలసి ఆయన విజయవాడ నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి ప్యాంట్రీ కార్‌లో తనిఖీలు నిర్వహించారు. ఆహార నాణ్యత, తయారీలో ఉపయోగించే ఆహార పదార్థాలు, కిరాణా సామగ్రి, ఉత్పత్తుల గడువు తేదీలు, ఫిర్యాదుల రిజిస్టర్‌లను తనిఖీలు చేసి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనంతరం తాడేపల్లిగూడెం, తణుకు స్టేషన్‌కు చేరుకుని అక్కడి ప్లాట్‌ఫాంలు, ప్రయాణికులకు అందుతున్న సేవలు, మౌలిక సదుపాయాలు, సూచికల బోర్డులు, వెయిటింగ్‌హాల్స్, టాయిలెట్‌లను పరిశీలించారు. అక్క డి ప్రయాణికులు, రైల్వే సిబ్బందితో మాట్లాడి స్టేషన్‌ల అభివృద్ధిపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్‌లలో జరుగుతున్న పునరాభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు.
విఘ్నేశ్వరునికి సంకటహర చతుర్ధి పూజలు
అమరావతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలోని విఘ్నేశ్వరస్వామి ఉపాలయంలో శుక్రవారం సంకటహర చతుర్ధి పూజలను నిర్వహించారు. ఆలయ అర్చకస్వామి జగర్లపూడి శేషసాయిశర్మ విఘ్నేశ్వర స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. స్వామికి వివిధ రకాల పుష్పాలతో, గరికెతో విశేషాలంకారం చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామికి ప్రత్యేక పూజలు చేసి ఉండ్రాళ్లను సమర్పించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment