● వరుసగా మూడు ఇళ్లలో చోరీ ● రూ.1.50 లక్షల విలువ చేసే వస్తువులు అపహరణ
ఓర్వకల్లు: మండలంలోని నన్నూరు గ్రామంలో శుక్రవారం రాత్రి దొంగలు హల్‌చేశారు. వరుసగా రెండు ఇళ్లు, ఓ దుకాణంలో చోరీకి పాల్పడి, అందినకాడికి దోచుకెళ్లారు. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు.. సీతారామ నగర్‌లో నివాసముంటున్న మనోహర్, కోటకొండ సత్యరాజు ఇళ్లకు తాళాలు వేసి, బంధువుల పెళ్లికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు వారి ఇంటి ముందు ఉన్న ఇంటికి బయటకు రాకుండా, బయట గడియ వేసి, పథకం ప్రకారం మనోహర్ ఇంటికి వేసిన తాళాలు పగులగొట్టి లోపలకు చొరబడ్డారు. ఇంట్లోని బీరువాను పగులగొట్టి రెండు తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. సమీపంలో ఉన్న ఎద్దుల ఎల్లారెడ్డి వ్యవసాయ పనిముట్ల దుకాణంలోకి చొరబడి రూ.50 వేల విలువ చేసే పనిముట్లను తస్కరించారు. అక్కడి నుంచి కోటకొండ సత్యరాజు ఇంట్లోకి ప్రవేశించి రూ.30 వేల నగదుతో ఉడాయించారు. చోరీ జరిగిందని గుర్తించిన బాధితులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సునీల్‌కుమారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment