తమ్ముళ్లకు తలో దుకాణం!
కర్నూలు(సెంట్రల్): ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వం కేవలం తమ పార్టీ నేతల కడుపునింపడమైనే దృష్టి సారించింది. అర్నెల్ల కాలంలో ఏ నిర్ణయం తీసుకున్నా అందులో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలకు దోచిపెట్టడమే లక్ష్యంగా కనిపిస్తోంది. అందులో భాగంగా మరో బంపరాఫర్ ఇచ్చేందుకు సర్వం సిద్ధమైంది. పౌరసరఫరాల శాఖలో డీలర్ పోస్టులను అదనంగా సృష్టించి మరీ తమ పార్టీల క్యాడర్‌కు కట్టబెట్టేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. సర్కార్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న డీలర్ పోస్టు పరిధిలోని కార్డుల సంఖ్యను తగ్గించి మిగిలిన కార్డులను కలుపుకొని అదనపు పోస్టులను సృష్టించారు. ఈ మేరకు పౌరసరఫరాల అధికారులు విభజన ప్రక్రియ చేపట్టి జిల్లాలో అదనంగా 150–200 వరకు డీలర్ పోస్టులు అందుబాటులోకి తెచ్చేలా సర్వే నిర్వహించారు. ఆయా పోస్టులకు కలెక్టర్ ఆమోదం తరువాత నోటిఫికేషన్ ఇచ్చి కూటమి నేతలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది.
షాపులు విభిజించి.. డీలరు పోస్టులు సృష్టించి
జిల్లాలో ప్రస్తుతం 1,233 రేషన్ షాపులు ఉన్నాయి. వీటి పరిధిలో 6,34,631 మంది రేషన్ కార్డు దారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 1 నుంచి 17వ తేదీల మధ్య 409 ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకులను సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపులను పెంచాలని నిర్ణయించింది. అయితే ఉన్న షాపులను కుదించి అదనపు దుకాణాలను పెంచేలా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ మార్గదర్శకాలను అనుసరించి పౌర సరఫరాల అధికారులు రేషన్ షాపుల విభజన చేపట్టారు. గతంలో ఒక్కో రేషన్ షాపు పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో 600–800 వరకు కార్డుదారులు ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్యను 400–450 కార్డుదారులకు పరిమితం చేశారు. ఫలితంగా మిగిలిన కార్డుదారులతో అదనపు డీలర్ పోస్టును సృష్టించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లోని రేషన్ షాపు పరిధిలో 800పైగా కార్డుదారులు ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్యను 500–550 వరకు కుదించారు. అలాగే మునిసిపల్ కార్పొరేషన్లలో 650 కార్డులు ఉండేలా విభజన చేసి అదనపు డీలర్ పోస్టులను సృష్టించారు. ఇందుకోసం ఇటీవల సర్వే నిర్వహించి విభజన ప్రక్రియను పూర్తి చేశారు. దాదాపు 150–200 వరకు అదనపు డీలర్ పోస్టులు సృష్టించినట్లు తెలుస్తోంది.
జిల్లాలో 117 డీలర్ పోస్టులు ఖాళీ..
ప్రస్తుతం ఉన్న 1,233 రేషన్ షాపులకు సంబంధించిన డీలర్ పోస్టుల్లో 117 ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఆదోని డివిజన్‌లో 38, కర్నూలు డివిజన్‌లో 46, పత్తికొండ డివిజన్‌లో 33 డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఖాళీ పోస్టులను తాత్కాలికంగా సమీపంలోని డీలర్లకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించి ఉంటారు. ఇన్‌చార్జీలు లేని చోటా వీర్వోలతో సరుకులను పంపిణీ చేయిస్తున్నారు.
త్వరలోనే డీలర్ పోస్టుల భర్తీకి చర్యలు..
పౌరసరఫరాల శాఖ కూటమి నేతలు, నాయకులు, కార్యకర్తలకు రాజకీయ విడిది కేంద్రంగా మారింది. ఉన్న డీలర్లను తొలగించి తమ వారిని నియమించుకున్నారు. అంతేకాక డీలర్ పోస్టులను సృష్టించి మరీ తమ పార్టీల నాయకులకు కట్టబెట్టేందుకు ముందుకొస్తున్నారు. ఖాళీ పోస్టులతోపాటు సృష్టించిన అదనపు డీలర్ పోస్టుల భర్తీకి అనుమతి కోసం పౌరసరఫరాల శాఖ అధికారులు కలెక్టర్‌కు నివేదించారు. ఆయన అనుమతి ఇస్తే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
వేధించి డీలర్లను తొలగిస్తున్న కూటమి ప్రభుత్వం...
ప్రస్తుతం ఉన్న డీలర్లను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోంది. వారికి పార్టీల ముద్ర వేసి తొలగించేందుకు 6ఏ కేసుల అస్త్రా న్ని ప్రయోగిస్తోంది. స్థానికంగా టీడీపీ నాయకులు చెప్పిన మాట ప్రకారం ఉన్న డీలర్లు తమ పదవిని వీడితే ఏమిలేదు. లేకపోతే 6ఏ కేసు నమోదు చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయించి వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 39 6ఏ కేసులు నమోదు చేసి 2,199 క్వింటాళ్ల బియాన్ని స్వాధీనం చేసుకొని 28 వాహనాలను సీజ్ చేశారు. ఇందులో 28 మంది డీలర్లపై క్రిమినల్ కేసులు కూడా పెట్టారు.
షాపులను విభజించి..
డీలర్ పోస్టులు పెంచి..
కూటమి నాయకులనే డీలర్లుగా
నియమించేందుకు రంగం సిద్ధం
ఇప్పటికే జిల్లాలో 1,233
డీలర్ పోస్టులు
అదనంగా దాదాపు 200 రేషన్
దుకాణాలు పెరిగే అవకాశం
దుకాణ విభజనను పూర్తి చేసిన
పౌరసరఫరాల అధికారులు
నివేదిక కలెక్టర్‌కు అందజేశాం
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పౌరసరఫరాల రేషన్ షాపుల పరిధిని తగ్గించేందుకు విభజన ప్రక్రియను చేపట్టాం. త ద్వారా కొత్తగా రేషన్ షా పులను ఏర్పాటు చేయబోతున్నాం. ఈ మేరకు కలెక్టర్‌కు నివేదిక ఇచ్చాం. ఆయన నుంచి అనుమతులు రాగానే కొత్త డీలర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటాం.ఖాళీ పోస్టులను కూడా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– రాజారఘువీర్, డీఎస్‌ఓ, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment