అట్టహాసంగా స్వర్ణోత్సవ సంబరం
● ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 50 వసంతాల వేడుక ● పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పూర్వ విద్యార్థులు ● నాటి అనుభూతులను గుర్తుచేసుకున్న వైనం
ఆత్మకూరు: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ స్వర్ణోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 1974లో మొదలైన ఈ కాలేజీలో విద్యనభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాల్లో స్థిరపడ్డారు. వారిలో పలువురు స్వర్ణోతవ కార్యక్రమానికి హాజరు కావడంతో కాలేజీలో పండుగ వాతావరణం నెలకొంది. రెండురోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ నాటి తరగతి గది స్మృతులను గుర్తు చేసుకున్నారు. కాలేజీ తొలి బ్యాచ్ విద్యార్థులు నాటి అనుభావాలను వేదిక మీద నుంచి పంచుకున్నారు. వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ రాంపుల్లారెడ్డి మాట్లాడుతూ ‘ఇంటర్ కాలేజీ ప్రారంభమైన తొలిరోజు తొలి విద్యార్థిగా చేరా. నాడు ఉన్నతస్థాయికి చేరుకుంటానని ఊహించలేదు. ఇక్కడి గురువులు చేసిన విద్యాబోధన, నేర్పిన క్రమశిక్షణతో ఐఏఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగా’నని చెప్పారు. తన ఉన్నతికి దోహద పడిన ఈ కాలేజీలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సహించేందుకు రూ.2 లక్షలు విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మరో రిటైర్డ్ ఐఏఎస్,వేల్పనూరుకు చెందిన జగన్నాథం మాట్లాడుతూ ‘ఆత్మకూరులో 1974లో ఇంటర్ కాలేజీ ప్రారంభంకాక పోయి ఉంటే నేను ఏదో ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సు చేసి ఫిట్టర్‌గానో మెకానిక్‌గాను ఉండేవాడిని. కాలేజీలో సీటు రావడంతో పట్టుదలతో బాగా చదువుకున్నా. ఈ కాలేజీ స్నేహితుడు రాంపుల్లారెడ్డి, మరికొందరు సహకారంతో ఐఏఎస్ సాధించా’నని చెప్పారు. విద్యాబుద్ధులు నేర్పిన కాలేజీ స్వర్ణోత్సవంలో నేడు పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు.ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్ట ర్ శంకర్‌శర్మ మాట్లాడుతూ తమది కరివేన గ్రామమని తొలిసారిగా ఆత్మకూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారని తెలిసి సంబరపడ్డానన్నారు. నేడు డాక్టర్‌గా రాణించగలుగుతున్నానంటే నాడు అధ్యాపకులు నేర్పిన విద్యాబుద్ధులే కారణమని చెప్పారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే ప్రతి విద్యార్థి లక్ష్యం పెట్టుకొని చదవాలన్నారు. ప్రభుత్వ కాలేజీలో చదివిన విద్యార్థు లు కలెక్టర్లు, డాక్టర్లు, న్యాయవాదులు ఇలా వివిధ స్థానాల్లో ఉన్నారంటే ఎంతో సంతోషంగా ఉందని అప్పట్లో బాటనీ అధ్యాపకుడిగా పనిచేసిన సీఎస్ కుమార్ పేర్కొన్నారు. అంతకు ముందు స్వర్ణోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మా ట్లాడుతూ కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, అవసరమైన సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులు గోదాదేవి కల్యాణ నృత్యాలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. తొలి బ్యాచ్ విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ రఘురామ ఆచార్యులు, అధ్యాపకులు శాలువ, పూలమాలలతో సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment