జగనన్న కాలనీల్లో పనులు తనిఖీ చేయండి
● డ్వామా పీడీ వెంకటరమణయ్య ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జగనన్న కాలనీల్లో చేపట్టిన పనులను పకడ్బందీగా తనిఖీ చేయాలని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట రమణయ్య ఆదేశించారు. తనిఖీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎనిమిది బృందాల ప్రతినిధులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలకు సంబంధించి 490 వర్క్‌లు ఉన్నాయని తెలిపారు. కాలనీల్లో మట్టి రోడ్లు వేయడం, గుంతలు పూడ్చడం, జంగిల్ క్లియరెన్స్ వంటి పనులు జరిగాయని, ఈ పనులకు సంబంధించి రూ.3 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఈ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ముందస్తుగా మరోసారి కాలనీల్లో పనులను తనిఖీ చేయాల్సి ఉందని వివరించారు.
పోలీసు ప్రధాన పరీక్షకు 246 మంది ఎంపిక
కర్నూలు: కర్నూలు ఏపీఎస్పీ రెండవ పటాలం మైదానంలో పోలీసు అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు శనివారం 600 మంది అభ్యర్థులను ఆహ్వానించగా 338 మంది బయోమెట్రిక్ పరీక్షకు హాజరయ్యారు. వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత ఎత్తు, ఛాతీ చుట్టు కొలతలు వంటి ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్టులు నిర్వహించారు. అందులో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్టులు 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ పరీక్షలు నిర్వహించారు. వాటిలో ప్రతిభ కనపరచి 246 మంది అభ్యర్థులు ప్రధాన పరీక్ష (మెయిన్స్)కు అర్హత సాధించారు. ఏదైనా సమస్యలపై ఇతర కారణాలతో అప్పీల్ చేసుకున్న అభ్యర్థులు ఈనెల 28వ తేదీన హాజరుకావాలని పోలీసు అధికారులు సూచించారు.
అందుబాటులో రేబిస్ టీకా
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని అన్ని ప్రభు త్వ ఆసుపత్రుల్లో రేబిస్ నివారణ టీకా అందుబాటులో ఉందని డీఎంహెచ్‌వో డాక్టర్ పి. శాంతికళ తెలిపారు. శనివారం జిల్లా వైద్య ఆ రోగ్యశాఖ కార్యాలయంలో పాముకాటు నిర్వహణ, రేబిస్ టీకా, రేబిస్ టోల్ ఫ్రీ నెంబర్‌పై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుక్కకాటు, ఇత ర జంతు సంబంధిత గాయాల తర్వాత రేబిస్ వ్యాధి నివారణలో రేబిస్ టీకా ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. పాము కాట్ల సందర్భంలో తీసుకోవాల్సిన ప్రాథమిక చికిత్స, వైద్య చర్యల గురించి సమాజానికి అవగాహన కల్పించాలన్నారు.కార్యక్రమంలో జిల్లా సర్వెలెన్స్ అధికారి డాక్టర్ నాగప్రసాద్ స్టాటిస్టికల్ అధికారి హేమసుందరం, డిస్ట్రిక్ట్ ఎపడమాలజీ, ఐడీఎస్‌పీ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
ఎమ్మిగనూరు రూరల్: కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని 22 కేంద్రాల్లో జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు బనవాసి నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి తెలిపారు. శనివారం నవోదయ ప్రవేశ పరీక్షా కేంద్రాలను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 80 సీట్ల కోసం 6,035 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇందులో ప్రవేశ పరీక్షకు 4,879 మంది విద్యార్థులు హాజరుకాగా 1,156 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.
రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు అందజేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment