బనశంకరీ శాసించారు.. ప్రజలు పాటించారు!
పూజలందుకుంటున్న బనశంకరీదేవి
ఊరేగింపుగా బోనాలు తీసుకొస్తున్న భక్తులు
సంప్రదాయం కొనసాగింది. బనశంకరీ ఆజ్ఞయే శాసనంగా ఆనాది కట్టుబాట్లను పాటించారు. దాదాపు నాలుగు శతాబ్దాల క్రితం నుంచి ఆచారాలు పాటిస్తూ భక్తిని చాటారు. జిల్లాలో సుళేకేరి గ్రామానికి ఎంతో ప్రత్యేకత ఉంది. గ్రామంలో శనివారం బనశంకరీదేవి (బందమ్మవ్వ) వేడుకలు కమనీయంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా కుంభోత్సవం కనుల పండువగా సాగింది. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి కుంభాలతో మహిళలు ఊరేగింపు చేపట్టారు. ఆచారంలో భాగంగా అవ్వకు వరిబియ్యం, కొర్రబియ్యం, పాలు, పెరుగు, వెన్నతో చేసిన నైవేద్యాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో సంగీత విభావరి, చెక్కభజనలు నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. బనశంకరీ ఆజ్ఞయే శాసనంగా గ్రామ ప్రజలు నేటికి శూన్య మాసం అమావాస్య నుంచి ప్రత్యేక ఆచారాలు పాటించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు నుంచి సుళేకేరి గ్రామస్తులు పాలు తాగిన రోజు పెరుగు తినరు. పెరుగు తిన్న రోజు పాలు తాగరు. అలాగే వెన్న తీసినా అలాగే ఉంచుతారు. నెయ్యి చేయరు. అవ్వ జాతర ముగియగానే ఆహార కట్టుబాట్లకు స్వస్తి పలుకుతారు. అయితే ఏడాది పొడవునా సోమవారం ఎద్దులకు సెలవు మాత్రం కొనసాగిస్తారు. ఆ రోజు వాటికి పూజలు సైతం చేస్తారు. – కౌతాళం
Comments
Please login to add a commentAdd a comment