స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుదాం
కోడుమూరు రూరల్: స్వచ్ఛ ఆంధ్ర– స్వచ్ఛ దివస్ కార్యక్రమం ద్వారా పరిశుభ్రత జిల్లాగా తీర్చిదిద్దుదామని కలెక్టర్ పి.రంజిత్‌బాషా పిలుపునిచ్చారు. శనివారం గూడూరులో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర– స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా స్థానిక నగర పంచాయతీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో వారు పాల్గొని ప్రజల చేత స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మూడవ శనివారం జిల్లాలోని పల్లెల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ వంతుగా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను కుండీల్లో వేయాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్న లక్ష్యంతో ప్రభు త్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కాగా తమను కూడా సభావేదికపైకి పిలవాలంటూ కొందరు టీడీపీ నాయకులు కొద్దిసేపు గందరగోళం సృష్టించగా, ఎమ్మెల్యే కలుగజేసుకుని ఇది ప్రభుత్వ కార్యక్రమని, పార్టీ కార్యక్రమం కాదంటూ నచ్చ జెప్పారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ జులుపాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్లు పీఎన్.అస్లామ్, లక్ష్మన్న, అసిస్టెంట్ కలెక్టర్ కల్యాణి, ఆర్డీఓ సందీప్‌కుమార్, సీఈఓ నాసరరెడ్డి, మైనార్టీ సంక్షేమ అధికారి సబీహా పర్వీన్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావు, డీపీఓ భాస్కర్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రంజిత్‌బాషా
Comments
Please login to add a commentAdd a comment