వలంటీర్ల ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ మద్దతు
కర్నూలు (టౌన్): వలంటీర్ల ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. వాళ్ల సమస్య పరిష్కారం కోసం అవసరమైతే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటామన్నారు. శనివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్ లోని తన చాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగాలు ఇచ్చే సంగతి దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలను తొలగించడమే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం తగదన్నారు. రాష్ట్రంలోనే నూతన వ్యవస్థను రూపొందించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అన్ని సేవలు గ్రామ స్థాయిల్లోను ప్రజలందరికీ అందే విధంగా జగనన్న సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మహిళలు, వృద్ధులు, పెన్షనర్లు, విద్యార్థులు, రైతులు.. ఇలా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారన్నారు. అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి 1.49 లక్షల ఉద్యోగాలు జగనన్న కల్పించారన్నారు. వలంటీర్ల వ్యవస్థను సర్వనాశనం చేసిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 35 వేల సచివాలయాల ఉద్యోగాలకు ఎసరు పెట్టిందని విమర్శించారు. ఉద్యోగాలు కల్పిస్తూ జాబ్ క్యాలెండర్ ప్రకటించాల్సిందిపోయి ఉన్న ఉద్యోగాలను తొలగించేందుకు క్యాబినెట్‌లో నిర్ణయించడం దారుణమన్నారు. పరిపాలన వ్యవస్థను నీర్వీర్యం చేసి టీడీపీ నాయకుల ఇళ్ల చుట్టూ తిప్పుకునేందుకు ప్రభుత్వం ఈ కుట్రలు చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా నిరుద్యోగ భృతిని పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు రూ.3వేలు భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మెడలు వంచుతామన్న
పవన్‌కళ్యాణ్ ఎక్కడ?
ప్రశ్నిస్తా.. అవసరమైతే ప్రభుత్వ మెడలు వంచుతా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన పవన్‌కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లను తొలగించిన చంద్రబాబు సర్కార్ మెడలు వంచకుండా ఆయనకు దాసోహమయ్యాడని విమర్శించారు. ఉద్యోగాల్లేవు, నిరుద్యోగ భృతి లేదు.. మరోవైపు ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నా.. డిప్యూటీ సీఎం నోరు మెదపడం లేదన్నారు.
సచివాలయాల వ్యవస్థను నీరుగార్చేలా
రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం
ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ఏది బాబు?
ప్రభుత్వ మెడలు వంచుతా అన్న పవన్ ఎక్కడ?
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment