నిర్వహణాధికారులు ఎక్కడ?
ఎస్‌ఎస్‌తాడ్వాయి: లక్షలాది మంది భక్తులు వచ్చే సమ్మక్క, సారలమ్మ జాతర, మేడారం అభివృద్ధి విషయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వైఖరిపై సమ్మక్క, సారలమ్మ పూజారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులంతా హనుమకొండలోనే ఉంటూ మేడారాన్ని పట్టించుకోవడం లేదంటున్నారు. ఇక్కడ జరిగే అభివృద్ధిలో తమ అభిప్రాయాలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మేడారానికి మంత్రులు, జిల్లా కలెక్టర్ వస్తేనే అధికారులు మేడారానికి వస్తున్నారని.. ప్రధానంగా కార్యనిర్వహణాధికారి కార్యాలయం మేడారంలో లేకపోవడంతో ఈఓ చుట్టపుచూపుగా ఇక్కడకు వస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
1996లో రాష్ట్ర పండుగగా గుర్తింపు
లక్షలాదిగా భక్తులు తరలివచ్చే మేడారం జాతర 1996లో దేవాదాయశాఖ పరిధిలోకి వెళ్లగా.. ఈ ఏడాది రాష్ట్ర పండుగగా గుర్తించారు. గద్దెల ప్రాంగణం పక్కన ఉన్న రేకుల గదుల్లో ఉంటూ ఈఓ సహా ఇతర సిబ్బంది జాతర సమయంలో సేవలు అందించేవారు. ఇటీవల దాన్ని కూల్చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మేడారంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని కాటేజీల్లో ఈఓ ఆఫీసు ఏర్పాటు చేసి, 2016 జాతర సందర్భంగా ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించారు. జాతర ముగిసిన తర్వాత మళ్లీ ఈఓ కార్యకలాపాలను హనుమకొండ నుంచే కొనసాగించారు. 2018 జాతర నాటికి అప్పటి సీఎం కేసీఆర్ మేడారం అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులతోపాటు 200 ఎకరాల స్థలాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖకు అప్పగిస్తామని ప్రకటించారు. కానీ, ఈ రెండు హామీలు అమలుకు నోచుకోలేదు. మరోవైపు తాత్కాలికంగా కొనసాగిన ఈఓ కార్యాలయం కూడా ఇక్కడి నుంచి దూరమైంది. కొన్ని సంవత్సరాలు హనుమకొండలోని అద్దె భవనంలో ఈఓ కార్యాలయాన్ని కొనసాగించారు. అనంతరం వరంగల్‌లో శాశ్వత ధార్మిక భవనం నిర్మించడంతో మేడారం ఈఓ కార్యాలయాన్ని అక్కడకు తరలించారు.
ఏళ్లు గడుస్తున్నా మేడారంలో ఏర్పాటు కానీ ఈఓ ఆఫీస్
మంత్రులు, ఉన్నతాధికారుల
పర్యటనల సమయంలోనే వస్తున్న ఈఓ
అసహనం వ్యక్తం చేస్తున్న ఆదివాసీ పూజారులు
వరంగల్ ధార్మిక భవనంలో
కొనసాగుతున్న కార్యాలయం
ఇన్‌చార్జ్ పాలనే..
మేడారం జాతర దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చి 30 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ మేడారం జాతరకు పూర్తిస్థాయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈఓ)ను నియమించకపోవడం గమనార్హం. ప్రతీసారి జాతర సందర్భంగా ఇతర ఆలయాల్లో సూపరింటెండెంట్ హోదా అధికారిని తాత్కాలిక ఈఓగా నియమిస్తున్నారు. ఆ తర్వాత మేడారం జాతరను పట్టించుకోవడం లేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మేడారంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రెండేళ్లకోసారి ఇక్కడ భక్తులు కనిపించే దశ నుంచి ప్రతి బుధవారం నుంచి ఆదివారం వరకు సగటున వెయ్యి మంది భక్తులు వచ్చే స్థితికి చేరుకుంది. వందల సంఖ్యలో ప్రైవేట్ కాటేజీలు, షాపింగ్ కాంప్లెక్స్ వెలిశాయి. అయితే వీరిని పట్టించుకునే వారు దేవాదాయశాఖ తరఫున ఇక్కడ ఎవరూ లేకపోవడం గమనార్హం.
మోకాలడ్డు?
ప్రస్తుతం మేడారం ఈఓగా ఉన్న రాజేంద్రం వరంగల్‌లోని థార్మిక భవన్ కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్నారు. మేడారంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి అతిథి సముదాయ నిర్మాణానికి రూ.2.15 కోట్లను 2022 జాతర సందర్భంగా మంజూరు చేశారు. ఈ నిర్మాణం పూర్తయితే ఇందులో ఈఓ ఆఫీసు నిర్వహణకు ఆస్కారం ఉండేంది. కానీ, మూడేళ్లు గడిచినా నిర్మాణ పనులు మొదలే కాలేదు. మరోవైపు ఇక్కడ మొదలు పెట్టిన రెవెన్యూ, ఆర్ అండ్ బీ అతిథి, ఆర్ డబ్ల్యూఎస్ అతిథి గృహాలు పూర్తయ్యాయి. అయితే మేడారంలో ఉంటూ విధులు నిర్వహించడం ఇష్టంలేకనే సంబంధిత అధికారులే పనులు అడ్డుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
ఈఓ ఆఫీస్ ఏర్పాటుపై నిర్లక్ష్యం
మేడారంలో ఈఓ ఆఫీస్ ఏర్పాటు చేయడంలో దేవాదాయశాఖ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. అధికారుల అవసరాల నిమిత్తం సిటీ వాతావరణానికి అలవాటు పడి మేడారంలో కార్యాలయం ఏర్పాటు చేయడం లేదు. చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మేడారంలో ఈఓ కార్యాలయం ఏర్పాటుకు కలెక్టర్ చర్యలు తీసుకోవాలి.
– సిద్ధబోయిన జగ్గారావు,
పూజారుల సంఘం అధ్యక్షుడు
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం
మేడారంలో ఈఓ కార్యాలయం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం. భక్తులకు అందుబాటులో ఉండి సేవలందిస్తాం.
– సునీత, అసిస్టెంట్ కమిషనర్,
దేవాదాయశాఖ
Comments
Please login to add a commentAdd a comment