ఎక్కడున్నా..ఇంటికి రా బిడ్డా.!
● డీసీపీ సమక్షంలో శారద తండ్రి వేడుకోలు
లింగాలఘణపురం : ‘ఎక్కడున్నావు బిడ్డా.. ఇంటికి రావమ్మా.. ముసలితనంలో ఉన్నా.. ఒక్కసారి చూడాలని ఉందమ్మా.. ఇదే నా చివరి కోరిక’ అంటూ మండలంలోని నెల్లుట్ల శివారు వడ్డెర కాలనీకి చెందిన అజ్ఞాతంలో ఉన్న పందిగోటి శారద తండ్రి చిన్నయ్య వేడుకున్నారు. సంక్రాంతి పండుగా సమీపిస్తున్న తరుణంలో అజ్ఞాతంలో ఉన్న శారద కుటుంబ సభ్యులకు జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో దుస్తులు, ఇంటి సామగ్రి, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ..1995లో విప్లవభావాలకు ఆకర్షితులరాలైన శారద దళంలోనే చేరి ఇప్పటి వరకు కొనసాగుతోందన్నారు. ఆమె తండ్రి చిన్నయ్య 75 ఏళ్ల వృద్ధాప్యంలో ఉన్నాడని, తల్లి చనిపోయిందని అజ్ఞాతంలో ఉన్న శారద జనజీవన స్రవంతిలో కలువాలని కోరారు. డీసీపీతో పాటు స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీమ్‌శర్మ, ఎస్‌బీ ఏసీపీ పార్థసారథి, రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, లింగాలఘణపురం ఎస్సై శ్రావణ్‌కుమార్ ఉన్నారు.
ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం
● కామాంధుడిపై పోక్సో కేసు నమోదు
కాటారం: ఓ కామాంధుడు మానవజాతికే కలంకం తెచ్చాడు. ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండల పరిధి ఓ గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన నరేశ్ అనే యువకుడు మూడు రోజుల క్రితం లైంగిక దాడికి యత్నించాడు. చిన్నారి తల్లిదండ్రులు ఇంటి దగ్గర లేకపోవడంతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నరేశ్‌పై పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై మహేందర్‌కుమార్ తెలిపారు.
కోనాపురంలో మరొకరిపై..
కొత్తగూడ : కొత్తగూడలోని కోనాపురం గ్రామానికి చెందిన సతీశ్ అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు గూడూరు సీఐ బాబూరావు తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు సతీశ్‌పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
భూపాలపల్లి రూరల్ : విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం భూపాలపల్లి మండలం కొత్తపల్లి(ఎస్‌ఎం)లో చోటు చేసుకొంది. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. గ్రా మానికి చెందిన మోతే సాంబయ్య(55) వ్యవసాయంతోపాటు ఎలక్ట్రీషియన్ పనులు చేస్తుంటాడు. మోరంచవాగు పరీవాహక ప్రాంతంలో ఓ రైతుకు చెందిన మోటారు మరమ్మతు చేస్తున్న క్రమంలో వి ద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాడు. దీనిపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment