అప్పుల బాధతో టాటా మ్యాజిక్ యజమాని ఆత్మహత్య
ఏటూరునాగారం: అప్పుల బాధతో టాటా మ్యాజిక్ యజమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బాస నాగరాజు(42)కు రెండు టాటా మ్యాజిక్‌లు ఉన్నాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో గిరాకీ లేక వాహనాల కిస్తీలు చెల్లించలేక అప్పుల పాలయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలని కొంతకాలంగా మనోవేదనకు గువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి మంగళవారం వరకూ తిరిగి రాలేదు. 163 జాతీయ రహదారి వెంట ఉన్న ఇటుక బట్టీల వద్ద పురుగుల మందుతాగి అపస్మారక స్థితిలో ఉన్నాడు. దీనిని చూసిన పలువురు వాహనదారులు కుటుంబ సభ్యులకు తెలపగా వారు ఘటనాస్థలికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది కనిపించాడు. ఈ ఘటనపై భార్య నవనీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బస్టాండ్‌లో మృతదేహంతో నిరసన..
నాగరాజు మృతదేహంతో ఏటూరునాగారం బస్టాండ్‌లో డ్రైవర్లు, యజమానులు టాటా మ్యాజిక్‌లతో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకపోవడంతో యజమానులు, డ్రైవర్లు దుర్భర జీవితాలు గడుపుతున్నారని టాటా మ్యాజిక్‌ల సంఘం అధ్యక్షుడు శీలం సూర్యనారాయణ అన్నారు. ప్రభుత్వం స్పందించి మృతుడి న్యాయం చేయాలని కోరారు. అలాగే, ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రసాద్, చాంద్, మున్న, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రైలు కిందపడి వృద్ధుడు..
రఘునాథపల్లి: జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధుడు రైలు కింద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రఘునాథపల్లి రైల్వేస్టేషన్ వద్ద జరిగింది. జనగామ రైల్వే పోలీసుల కథనం ప్రకారం..మండలంలోని కుసుంబాయితండా గ్రామ శివారు రామన్నగూడేనికి చెందిన మరాఠి యాదగిరి (60) ఒంటరి జీవనం గడుపుతున్నాడు. జీవితంపై విరక్తి చెందిన యాదగిరి.. మంగళవారం తెల్లవారుజామున రఘునాథపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ రమణారెడ్డి, కానిస్టేబుల్ రాఘవేంద్ర ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment