ఆశల పల్లకిలో అందరూ.. అర్హులు ఎందరో?
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మరో నాలుగు సంక్షేమ పథకాలకు ఈ నెల 26న శ్రీకారం చుడుతోంది. కొన్ని సంవత్సరాలుగా నిరుపేదలు ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల జారీ, గూడులేని పేదల కలలు సాకారం చేసే విధంగా ఇందిరమ్మ ఇళ్లు, రైతుల ఆశలకు తగ్గట్టుగా రైతు భరోసా, కూలీల ఆత్మీయ భరోసా వంటివి అమలు చేయడానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి గురువారంనుంచి తుది దశ కసరత్తు మొదలైంది. ఈ నెల 20 వరకు క్షేత్రస్థాయిలో పర్యటించనున్న అధికారుల బృందాలు.. 21 నుంచి 24 తేదీవరకు గ్రామసభల్లో వివరాల ప్రదర్శించనున్నారు. 24న తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుండగా.. అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్‌లతో సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా గానీ, లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గాని ఈ సమావేశం ఉంటుందని తెలిసింది.
అర్హులకే అందేలా కసరత్తు..
రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు.. ఈ నాలుగు పథకాలపై ఉమ్మడి వరంగల్‌కు చెందిన ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆచితూచి అర్హులను ఎంపిక చేసేందుకు వడపోత కొనసాగిస్తున్నారు. ఈనెల 26వ తేదీ నుంచి అర్హులైన రైతులకు ప్రతీ సంవత్సరం ఎకరానికి రూ.12 వేల చొప్పున నగదు జమ చేసే ప్రక్రియ మొదలుకానుంది. వానాకాలం, యాసంగి సీజన్లలో ఆరువేల రూపాయల చొప్పున నగదు అందనుంది. జిల్లాలో వానాకాలం పంటల సాగు 7.15 లక్షల ఎకరాలు సాగుకాగా ప్రస్తుత యాసంగి పంటల సాగు అంచనా ప్రకారం 5.25 లక్షల ఎకరాలుగా ఉంది. 2024 యాసంగిలో 8,77,173 మంది రైతులకు రూ.880 కోట్ల రూపాయల రైతు భరోసా అందింది. ప్రస్తుతం ప్రభుత్వం రూపొందించిన విధివిధానాల మేరకు ఎందరికి భరోసా దక్కుతుందో ఈనెల 26వ తేదీన తేలనుంది. ఇందిరమ్మ ఇళ్లు ఉమ్మడి జిల్లాకు 40 వేలు రానున్నాయి. ఇప్పటికే ప్రజాపాలన సభల ద్వారా సుమారు 1.58 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నారు. వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి సర్వే చివరి దశకు చేరుతుండగా.. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు కూడా ఫైనల్‌గా తనిఖీలు చేస్తున్నారు. తొలి దశలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 చొప్పున 12 నియోజకవర్గాలకు 40 ఇళ్లు కేటాయించనున్నారు. అలాగే భూమిలేని నిరుపేదల ప్రతి సంవత్సరం రూ. 12 వేల చొప్పున రెండు విడతలుగా ఇచ్చేందుకు అర్హులపై ఆరా తీస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 18.45 లక్షల మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నట్లు గుర్తించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో అమలు అయ్యే ఈ పథకానికి భూమిలేని నిరుపేదల కుటుంబాన్ని యూనిట్‌గా ఎంపిక చేసి అమలు చేయనున్నామని ఓ అధికారి చెప్పారు.
నాలుగు సంక్షేమ పథకాలకు 26న ముహూర్తం
ఉమ్మడి వరంగల్‌లో మొదలైన
అధికారుల కసరత్తు
20 వరకు గ్రామాలలో క్షేత్రస్థాయి సర్వే..
24న ప్రభుత్వానికి తుది నివేదిక
అదేరోజు కలెక్టర్‌లతో సీఎం సమావేశం?
ఏ పథకం కోసం.. ఎందరంటే..
జిల్లా రైతు బంధు రేషన్‌కార్డుల ఉపాధి పనులకు
(గతంలో లబ్ధిదారులు) దరఖాస్తులు వెళ్తున్న కూలీలు
హనుమకొండ 1,50,982 5650 2,57,968
వరంగల్ 1,54,405 4820 2,73,913
భూపాలపల్లి 1,16,574 15,625 2,92,446
ములుగు 76,692 12,158 2,06,211
జనగామ 1,85,937 43,370 2,78,838
మహబూబాబాద్ 1,92,583 76,197 5,35,950
మొత్తం 8,77,173 1,57,820 18,45,326
Comments
Please login to add a commentAdd a comment