తెగుళ్ల బెడద
మరిపెడ రూరల్: ఆరుగాలం కష్టపడే రైతులకు ఏటా తెగుళ్ల బాధ తప్పడం లేదు. అన్నదాతలు ఎంతో ఆశతో మిరప సాగు చేయగా.. తెగుళ్ల బెడదతో దిగుబడి తగ్గుతోంది. దీనికి తోడు మార్కెట్‌లో ధర రోజురోజుకూ పడిపోతోంది. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని, ఏటా అప్పులే మిగులుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.70నుంచి రూ.80 వేలు పెట్టుబడి పెట్టారు. పంట చేతికి వచ్చే సమయానికి తెగుళ్లు సోకడంతో రైతులు దిగులు చెందుతున్నారు.
తెగుళ్ల దాడి..
మిర్చి పంటకు ఆకుముడత, నల్లి, జెమినీ వైరస్, వేరుకుళ్లు వంటి తెగుళ్లు సోకాయి. ఒక్కసారిగా రెండు, మూడు రకాల తెగుళ్లు సోకడంతో చెట్టంతా ముడచుకుపోయింది. నల్లి తెగులు కారణంగా పూత నిలవడంలేదు. మరో పక్క ఆకు ముడుచుకుంటుంది. వేరుకుళ్లుతో చెట్లు వాడిపోయి చచ్చిపోతున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా తెగుళ్లు అదుపులోకి రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
మిరప పంటను ఆశిస్తున్న వైరస్
దిగుబడి తగ్గిపోతుందని రైతుల ఆవేదన
మార్కెట్‌లో ధరల పతనం
ధరల పతనం..
ఈ దఫా మంచి విత్తనాలు సాగు చేశామని, ఎకరాకు 30నుంచి 40క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు. అయితే పలు రకాల తెగుళ్లు సోకడంతో దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు దిగుబడి క్షీణిస్తుంటే, మరోవైపు మార్కెట్‌లో ధర క్వింటాకు రూ.15 వేలకు పడిపోవడంతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment