మిల్లర్లపై కొరడా | - | Sakshi
Sakshi News home page

మిల్లర్లపై కొరడా

Published Sat, Sep 21 2024 1:36 AM | Last Updated on Sat, Sep 21 2024 1:36 AM

మిల్లర్లపై కొరడా

వనపర్తి: సీఎంఆర్‌ ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. మొదట సీఎంఆర్‌ కోసమే ధాన్యం కేటాయించినా.. పెరిగినపోయిన మునుపటి బియ్యం నిల్వల దృష్ట్యా 2022– 23 రబీ సీజన్‌కు సంబంధించి బియ్యం కోసం కాదని, యాక్షన్‌లో పెట్టేందుకు ఆ ధాన్యం ఉపయోగించాలని నిర్ణయించిన సివిల్‌ సప్లయ్‌ శాఖకు ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు యాక్షన్‌లో పెట్టేందుకు సిద్ధమైతే.. ధాన్యం లేకపోవడంతో మిల్లర్లపై అధికారులు దాడులు చేస్తున్నారు. జిల్లాలో గత 15 రోజుల క్రితం ఐదు మిల్లర్లపై కేసులు నమోదు చేయగా.. తాజాగా శుక్రవారం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ఎండీ చౌహాన్‌ ఆదేశాల మేరకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం జిల్లాలో పర్యటించి రెండు మిల్లులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం మిల్లర్లలో గుబులు పుట్టిస్తోంది. గతంలో జిల్లాలో పనిచేసిన ఓ ఉన్నతాధికారి బంధువులకు సంబంధించిన వనపర్తి మండలంలోని నాచహళ్లి గ్రామ శివారులోని ఓ బాయిల్డ్‌ మిల్లులో రూ.33.83 కోట్లు, వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గామంలోని ఓ రా మిల్లులో రూ.7.86 కోట్ల విలువ చేసే ధాన్యం నిల్వలు లేకపోవడంతో ప్రస్తుతం కేసులు నమోదు చేసినట్లు పౌరసరఫరాల శాఖ డీఎం ఇర్ఫాన్‌ వెల్లడించారు. 2022– 23 రబీ సీజన్‌లో ధాన్యం దించుకున్న మిల్లర్లలో 90 శాతం మిల్లర్లు డిపాల్టర్లుగానే ఉన్నట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు.

ఆ ప్రశ్నకు సమాధానమేది?

2022– 23 రబీ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా సుమారు 78 నుంచి 80 మిల్లర్లకు 2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేటాయించారు. బియ్యం అక్కరలేదు కేవలం ఈ ధాన్యం యాక్షన్‌లో పెట్టేందుకేనని కేటాయింపులు చేసిన కొన్నాళ్లకే చెప్పినా.. మిల్లర్లు పెడచెవిన పెట్టి ఎక్కడికక్కడ నిల్వలను ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల అప్పటి ధాన్యం వేలం వేసేందుకు పౌరసరఫరాల శాఖ ప్రక్రియ ప్రారంభించే క్రమంలో పరిశీలన చేయగా.. సదరు ధాన్యం నిల్వలు ఎక్కడా కనిపించకపోవడం, దీనికి సంబంధించి మిల్లర్ల నుంచి సరైన సమాధానం లేకపోవడంతో పౌరసరఫరాలశాఖ సీరియస్‌గా తీసు కుంది. ఈ మేరకు క్రమినల్‌ కేసుల నమోదుకు ఆదేశించడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల బృందం రంగంలోకి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహాలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేస్తూ.. కేసులు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అటు మిల్లర్లు, ఇటు పౌరసరఫరాల శాఖ అధికారుల్లో చర్చ జోరుగా సాగుతోంది.

● సీఎంఆర్‌ పెండింగ్‌ ఉన్న కొందరు రైస్‌ మిల్లర్ల ఇళ్లపై దాడులు చేసి ఆర్‌ఆర్‌ యాక్ట్‌ అమలు చేసి ఆస్తులను జప్తు చేసిన విషయంలో మిల్లర్లు సైతం ఆందోళన బాటపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి జిల్లాలో మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనేలా చేస్తోంది. కాగా.. కొందరు మిల్లర్లు మాత్రం బలవంతంగా ధాన్యం అంటగట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నారు.

చర్యలు తప్పవు..

పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు 2022– 23 రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం ఎవరి వద్ద లేకున్నా చర్యలు తప్పవు. గతంలో ఐదు మిల్లులపై కేసులు నమోదు చేశాం. తాజాగా మరో రెండు మిల్లులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయించాం. జిల్లావ్యాప్తంగా 2.20 లక్షల మె.ట., ధాన్యం మిల్లర్ల నుంచి మాకు రావాల్సి ఉంది. ఈ ధాన్యం యాక్షన్‌ చేసేందుకు ఉంచాం. సీఎంఆర్‌ కోసం ఉపయోగించొద్దని ఆదేశాలున్నాయి. అయినా ధాన్యం నిల్వలు లేకపోవడంతో చర్యలు తీసుకుంటున్నాం.

– ఇర్ఫాన్‌, డీఎం సివిల్‌ సప్లయ్‌ శాఖ, వనపర్తి

పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ఆదేశాలతో రంగంలోకి స్పెషల్‌ టీం

వనపర్తి జిల్లాలో ధాన్యం లేని

రెండు మిల్లులపై కేసులు నమోదు

శుక్రవారం రాత్రి వరకు కొనసాగినఆకస్మిక తనిఖీలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement