ఆవిష్కరణలు అదరహో
స్మార్ట్ చేతికర్ర.. ఇంటి నమూనా
కళ్లు కనిపించని వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో స్మార్ట్ చేతికర్ర, స్మార్ట్ ఇంటి నమూనాలను విద్యార్థులు శృతి, సాక్షి ఆవిష్కరించారు. ఈ మేరకు స్మార్ట్ చేతికర్రతో బయటికి వెళ్లిన వ్యక్తికి ఆ కర్ర ఎదురుగా ఏదైనా వస్తువు వస్తే వెంటనే అలారం వచ్చే విధంగా రూపొందించారు. దీంతోపాటు స్మార్ట్ హోంలో ఎవరైనా బయటి వ్యక్తులు వెళ్తే ఆటోమేటిక్‌గా అలారం శబ్ధం చేస్తుంది. దీంతో కళ్లు కనిపించని అంధులకు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థులు పేర్కొన్నారు.
– శృతి, సాక్షి, శ్లోక స్కూల్, జడ్చర్ల
ఆటోమేటిక్ అలారం
ప్రజలు సొంత పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లినప్పుడు ఇటీవల చాలా చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టేందుకు విద్యార్థిని నిఖిత ఆటోమేటిక్ అలారాన్ని కనుగొన్నారు. బయటికి వెళ్లే క్రమంలో అలారం ఆన్ చేసి వెళ్తే మన ప్రమేయం లేకుండా వ్యక్తులు డోర్ తెరిచినప్పుడు పెద్ద శబ్ధంతో అలారం మోగుతుంది. దీంతో చుట్టుపక్కల వారు అలర్ట్ అయ్యేందుకు అవకాశం ఉంది.
– నిఖిత, జెడ్పీహెచ్‌ఎస్ ఇబ్రహింబాద్
అవసరాలు తీర్చే రోబో..
ఇంట్లో చిన్నపాటి అవసరాలను తీర్చేలా.. తక్కువ ఖర్చుతో ఇంట్లో లభించే వస్తువులతో కావేరమ్మపేట విద్యార్థులు చిన్నపాటి రోబోను ఆవిష్కరించారు. దీంతో ఇంట్లో చిన్నపాటి వస్తువులను మోసుకెళ్లడం, చిన్నపిల్లలు కాలక్షేపం చేసే విధంగా వారిని ఆడించడం వంటి పనులను ఈ రోబో చేస్తుంది. వీటి వల్ల ఇంట్లో అవసరాలు తీర్చే అవకాశం ఉన్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు.
– చందు, వరుణ్, కావేరమ్మపేట, జడ్చర్ల
జిల్లాకేంద్రంలోని ఫాతిమా విద్యాలయంలో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ప్రదర్శన విద్యార్థుల్లో ఆలోచనలను రేకెత్తించింది. విద్యార్థుల ఆవిష్కరణలు సమాజ ప్రగతికి దోహదపడేలా.. శాస్త్ర, సాంకేతిక అంశాలపై పట్టుసాధించేలా గొప్పగా ఆవిష్కరించారు. సాధారణ ప్రజల నుంచి శాస్త్రవేత్తలు ఇలా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా తమ చిట్టి బుర్రలతో ఎంతో మేలు చేకూర్చే ఆవిష్కరణలకు రూపమిచ్చారు. – మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్
ఫైర్ స్ప్రింక్లింగ్ రోబోట్..
భవనాలు ఇతర చోట్ల మంటలు అంటుకున్న సమయంలో వ్యక్తుల ప్రమేయం లేకుండా నేరుగా రోబో సహాయంతో నీటిని పోసి ఆర్పే విధంగా విద్యార్థిని తేజశ్రీ ఫైర్ స్ప్రింక్లింగ్ రోబోట్‌ను ఆవిష్కరించారు. దీని ద్వారా మంటలు ఆర్పే క్రమంలో వ్యక్తులకు గాయాలు కాకుండా పూర్తి ఖచ్చితత్వంతో మంటలు ఆర్పే రోబోను ఆవిష్కరించారు. దీని ద్వారా మనుషులకు మంటల్లో ఇబ్బంది కలగకుండా నేరుగా నీటిని పోసే ఆస్కారం ఉందని విద్యార్థులు తెలిపారు.
– తేజశ్రీ, జెడ్పీహెచ్‌ఎస్, చిన్నవార్వాల్
Comments
Please login to add a commentAdd a comment