భక్తిశ్రద్ధలతో మన్యంకొండకు పాదయాత్ర
స్టేషన్ మహబూబ్‌నగర్: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం మన్యంకొండకు మహాపాదయాత్ర చేపట్టారు. జిల్లా కేంద్రం బ్రాహ్మణవాడిలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర బండమీదిపల్లి, ధర్మాపూర్ మీదుగా మన్యంకొండ దేవస్థానం వరకు నిర్వహించారు. వందలాది మంది భక్తులు గోవిందనామ, హరినామ సంకీర్తనలతో పాదయాత్ర చేపట్టారు. అనంతరం భక్తులు మన్యంకొండ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వాసవీ ఆలయ ప్రధాన అర్చకులు గొండ్యాల రాఘవేంద్రశర్మ మాట్లాడుతూ ఇలాంటి యాత్రలు చేయడం వల్ల హిందువుల్లో ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. భక్తిమార్గం దిశగా యువతను నడిపించడానికి ఇలాంటివి ఉపయోగపడుతాయని అన్నారు. ధనుర్మాసంలో విష్ణు క్షేత్రాన్ని దర్శించుకోవడం మోక్షదాయకమన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి, స్వరలహరి కల్చరల్ అకాడమీ అధ్యక్షుడు నాయిని భాగన్నగౌడ్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గుండ వెంకటేశ్వర్లు, మిర్యాల వేణుగోపాల్, కోశాధికారి తల్లం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment