కమనీయం.. ఆది దంపతుల కల్యాణం
● భోగ మహేశ్వరంలో ఉమామహేశ్వరుడి కల్యాణోత్సవం
● పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు
● గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రభలు
అచ్చంపేట: శ్రీశైల క్షేత్రం ఉత్తర ద్వారమైన ఉమామహేశర్వం దిగువ కొండ భోగ మహేశ్వరంలో గురువారం తెల్లవారుజామున ఆది దంపతుల కల్యాణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఉమామహేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. బుధవారం రాత్రి ఉమామహేశ్వర క్షేత్రం నుంచి స్వామివారి ఉత్సవ మూర్తిని పల్లకీలో భోగ మహేశ్వరానికి తీసుకువచ్చారు. అచ్చంపేట భ్రమరాంబ ఆలయంతో పాటు పలు మండలాలు, గ్రామాల నుంచి ప్రభలు భోగ మహేశ్వరం చేరుకున్నాయి. కల్యాణ మండపానికి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులు చేరుకున్న అనంతరం కల్యాణ వేడుక ప్రారంభమైంది. ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ దంపతులు పట్టువస్త్రాలు, ఆలయ చైర్మన్ భీరం మాధవరెడ్డి, ఈఓ శ్రీనివాసరావు అలంకరణ వస్త్రాలను సమర్పించారు. అనంతరం వేద పండితులు వీరయ్యశాస్త్రి, నీలకంఠశాస్త్రి శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణ వేడుకను కనులారా తిలకించి తన్మయం చెందారు. అనంతరం ఉమామహేశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
● ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రాంతఃకాల పూజలు నిర్వహించారు. ఉదయం 9గంటలకు గవ్యాంత పూజలు, వాస్తు పూజ, వాస్తుహోమం, రుద్రాభిషేకం, రుద్రహోమం, ప్రాతఃరౌపాసన, నిత్యబలిహరణ, సాయంత్రం 4 గంటలకు సాయమౌపాసన, బలిహరణం, నీరాజనము, మంత్రపుష్పం, నందివాహనం సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మామిళ్లపల్లి ఆలయ కమిటీ చైర్మన్ నర్సింహారావు, భ్రమరాంబ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్, కట్ట అనంతరెడ్డి, అనంత ఇంద్రారెడ్డి తదితరుల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment