ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ

Published Sat, May 11 2024 12:40 AM

ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ

● కోర్టు కేసుతో లెక్కింపు కేంద్రంలోనే పోలింగ్‌ సామగ్రి ● కలెక్టరేట్‌లోని గోదాముకు ఈవీఎం, వీవీ ప్యాట్లు తరలింపు

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): హాజీపూర్‌ మండలం ముల్కల్ల ఐజా కళాశాలలోని లెక్కింపు కేంద్రంలో ఉన్న ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు ఎట్టకేలకు శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని గోదాముకు తరలించారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు మిగతా పోలింగ్‌ సామగ్రి లెక్కింపు కేంద్రంలోనే ఉంచారు. వివరాలిలా ఉన్నాయి. గత ఏడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఫలితాలు వెలువడిన నాటి నుంచి 45రోజులపాటు ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, పోస్టల్‌బ్యాలెట్‌ పేపర్లు, వీవీ ప్యాట్లలోని స్లిప్పులు, మాక్‌పోల్‌ ధ్రువపత్రాలు, పీఓ డైరీ, టెండర్‌ బ్యాలెట్‌ పేపర్లు తదితర ఎన్నికల సామగ్రి స్ట్రాంగ్‌ రూముల్లోనే భద్రపరిచి ఉన్నాయి. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు తన ఎన్నికల తన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని రఘునాథ్‌ కోర్టును ఆశ్రయించారు. దీంతో మంచిర్యాల నియోజకవర్గం మినహా చెన్నూర్‌, బెల్లంపల్లి నియోజవర్గాల ఎన్నికల సామగ్రి ఈ ఏడాది జనవరి 17వరకు ఐడీఓసీలోని స్ట్రాంగ్‌ రూముకు చేరాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈవీఎం, వీవీ ప్యాట్లు విడుదల చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సంతోష్‌ కోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లు, వీవీ ప్యాట్లలోని స్లిప్పులు, మాక్‌ పోల్‌ ధ్రువ ప్రతాలు, పీఓ డైరీ, టెండర్‌ బ్యాలెట్‌ పేపర్లు తదితర ఎన్నికల సామగ్రి మినహా ఈవీఎం, వీవీ ప్యాట్లు తరలించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, కేసుతో ప్రమేయం ఉన్న వారి సమక్షంలో ఈవీఎంలు విడుదల చేసి తరలించినట్లు కలెక్టర్‌ సంతోష్‌ తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతీలాల్‌, ఆర్డీఓ రాములు, ఎన్నికల తహసీల్దార్‌ శ్రీనివాస్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, ఎన్నికలు ముగిసిన అనంతరం కోర్టు ఈపీ కేసు విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement