బాల శాస్త్రవేత్తలు భళా..!
● ఇన్‌స్పైర్‌లో విద్యార్థుల ప్రతిభ ● 15 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపిక
సురక్షిత కొడవలి..
సురక్షిత కొడవలితో గడ్డి కోస్తున్నప్పుడు సేఫ్టీ సికిల్ స్విచ్ ఆన్‌చేస్తే పాములు రైతు వైపునకు రాకుండా దూరంగా వెళ్లిపోతాయి. టార్చిలైట్ ఆన్‌లో ఉండడం వలన చీకట్లో కూడా రైతులు సురక్షితంగా గడ్డి కోయవచ్చు. ఈ కొడవలి హ్యాండిల్‌లో ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్ పొందటానికి సేఫ్టీ సికిల్ చివర క్యాప్ తెరిస్తే కాటన్, ట్యాబ్లెట్లు కనిపిస్తాయి.
– నందం శరణ్య,
జెడ్పీహెచ్‌ఎస్, ఇంక్లైన్–2, బెల్లంపల్లి
మంచిర్యాలఅర్బన్: విద్యార్థుల్లోని సృజనాత్మకత, ఆలోచనాశక్తిని వెలికితీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైన్స్‌ఫెయిర్, ఇన్‌స్పైర్ మనక్ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ 30, డిసెంబర్ 1న జిల్లాస్థాయిలో వైజ్ఞానిక, ఇన్‌స్పైర్ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాకు చెందిన విద్యార్థులు తాము రూపొందించిన 149 ప్రాజెక్టులను ప్రదర్శించగా 15 రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. ప్రతిభ కనబర్చిన పలువురు విద్యార్థులపై ‘సాక్షి’ కథనం..
జిల్లా కేంద్రంలో ప్రాజెక్టులు ప్రదర్శిస్తున్న విద్యార్థులు
ఆటోమెటిక్ టాయిలెట్ క్లీనింగ్ సిస్టం
గాలి నుంచి విద్యుత్ ఉత్పత్తి..
పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్ ఇలా జనసాంద్రత ఎక్కువగా ఉండేచోట టాయిలెట్లు వాటర్ పోయకుండా వెళ్లడం వలన అపరిశుభ్రంగా ఉంటాయి. ఇలాంటి సమస్యలను నివారించేందుకు ఆటోమెటిక్ ఆప్డేటెడ్ టాయిలెట్ క్లీనింగ్ సిస్టం రూపొందించారు. డోర్ తెరవగానే ట్యాంక్‌నుంచి నీటిసరఫరా జరిగి టాయిలెట్ శుభ్రం అవుతుంది. ఇలా లోపలికి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు డోర్లు ఓపెన్ కావడంతో రెండుసార్లు నీటితో శుభ్రం చేసేందుకు దోహదపడుతుంది.
– శ్రావణ్‌కుమార్, జెడ్పీహెచ్‌ఎస్ అన్నారం
గాలినుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం ప్రాజెక్టు ముఖ్యఉద్దేశం. ఈపద్ధతిలో పూర్తిగా పర్యావరణ హిత పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఇందులో బొగ్గు, పెట్రోలియం వంటి వాటిని కాకుండా కేవలం వాహనాల చలనం వల్ల వచ్చే గాలి వేగంను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయడం లక్ష్యం. ఒక పరికరం ద్వారా సుమారు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు అరవై నుంచి వంద వాట్స్ కరెంట్ ఉత్పత్తి చేయవచ్చు.
– ఆరాథ్య, టీఎస్‌ఎంఎస్, మంచిర్యాల
Comments
Please login to add a commentAdd a comment