ఎస్టీపీపీ జీఎం ఆత్మహత్య
జైపూర్: 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో నూతనంగా ఎఫ్‌జీడీ నిర్మాణం చేపడుతున్న పీఈ ఎస్ ఇంజనీరింగ్ సర్విస్ కంపెనీ సీనియర్ జనరల్ మేనేజర్ (జీఎం)గా విధులు నిర్వర్తిస్తున్న బొబ్బా తిరుపతిరావు (అలియాస్ బీటీరావు)(56) మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌కు చెందిన తిరుపతిరావు రెండేళ్లుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతుండగా ఆపరేషన్ సైతం చేయించుకున్నాడు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు ఒంటరి జీవితం గడుపుతుండడంతో మనస్తాపానికి గురై మంగళవారం తాను నివాసం ఉంటున్న క్వార్టర్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. మృతునికి భార్య స్వప్న, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని సోదరుడు శ్రీనివాస్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. యువ ఇంజినీర్ కిరీటీ ఆత్మహత్య మరువక ముందే మరో అధికారి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికులలో ఆందోళన కలిగిస్తోంది.
ప్రాజెక్టులో దూకి ఒకరు ..
ఆసిఫాబాద్‌రూరల్: కుమురం భీం ప్రాజెక్టులో దూకి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అడ గ్రామానికి చెందిన భీమయ్య (70) కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి గ్రామ సమీపంలోని కుమురం భీం ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం మృతదేహాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృతునికి భార్య రుక్ముబాయి, కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
మద్యం మత్తులో యువకుడు..
చింతలమానెపల్లి: మద్యం మత్తులో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఇస్లావత్ నరేష్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని గూడెం గ్రామానికి చెందిన మండిగా సాయి (23) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం మద్యం మత్తులో ఇంటి సమీపంలోని పెరట్లో చున్నీతో ఉరేసుకున్నాడు. మృతుని భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
విద్యుత్‌షాక్‌తో ఒకరు మృతి
భీమారం: విద్యుత్‌షాక్‌తో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వెల్ది గ్రామానికి చెందిన పప్పు చంద్రమౌళి (53) భీమారంలోని ఐటీడీఏ కాలనీలో నివస్తున్న అతని అల్లుడు రాంటెంకి రంజిత్ కుమార్ ఇంటికి మూడురోజుల క్రితం వచ్చాడు. మంగళవారం ఇటీవల నిర్మించిన భవనంపైకి 20 ఫీట్ల ఇనుపరాడ్ తీసుకెళ్తుండగా పైన ఉన్న 11కేవీ విద్యుత్ తీగలకు రాడ్ తగలడంతో షాక్‌కు గురయ్యాడు. అతనికి సహాయం చేస్తున్న పక్కింటికి చెందిన బాలుడు వంశీకృష్ణకు గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చంద్రమౌళి మృతి చెందాడు. రంజిత్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్వేత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment