పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే
● కలెక్టర్ కుమార్ దీపక్
● గ్రామాల్లో సర్వే పరిశీలన
బెల్లంపల్లి/భీమిని: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించి లబ్ధిదారుల వివరాలు సమగ్రంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం ఆయన బెల్లంపల్లి పట్టణంలోని 1, 4, 11, 20వ వార్డుల్లో, కన్నెపల్లి మండలం జన్కాపూర్, జజ్జరవెల్లి, కన్నెపల్లి గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. భీమిని మండలంలో సర్వే ఆలస్యంపై ఎంపీడీవో శంకర్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా అందజేసిన దరఖాస్తుదారుల వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. నిర్ణీత గడువులోగా నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. పెద్ద గ్రామ పంచాయతీల్లో సిబ్బంది సంఖ్య పెంచి సర్వే పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం జజ్జరవెల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. నూతన కామన్ మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని తెలిపారు. తరగతుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని, వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, చైర్‌పర్సన్ శ్వేత, కౌన్సిలర్లు, తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, ఏపీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment