ముక్కిపోయి.. పురుగుపట్టి
రూ. అర కోటి విలువైన ఫోర్టిఫైడ్ రైస్ మట్టిపాలు
● గతంలో రూ. కోట్లు విలువ చేసే రేషన్ బియ్యం పక్కదారి ● గోదాముల్లో నిల్వ ఉన్న సరుకుపై పట్టింపేది? ● సివిల్ సప్లై శాఖలో బయటపడుతున్న లొసుగులు
అధికారుల నిర్లక్ష్యంలో రూ. కోట్లు విలువ చేసే రేషన్ బియ్యం పక్కదారి పట్టడంతో పాటు ముక్కిపోతున్నాయి. తాజాగా మరో రూ. అరకోటి (బలవర్ధక) బియ్యానికి పురుగులు పట్టింది. గోదాముల్లో నిల్వ
ఉంచిన బియ్యానికి సంబంధించి సరైన నిర్వహణ లేకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొంది. సివిల్ సప్లై శాఖలో గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన ఓ జిల్లా అధికారి నిర్వాకంతో అనేక లొసుగులు వెలుగు చూడటం.. పలువురి సిబ్బందిని సస్సెండ్ చేయడం మరవకముందే మళ్లీ సంఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.
మెదక్‌జోన్: జిల్లాలో గతంలో మెదక్, రామాయంపేట, చేగుంట, తూప్రాన్ గోదాముల్లో టన్నుల కొద్ది బియ్యం పక్కదారి పట్టింది. పలువురు గోదాం ఇన్‌చార్జిలను సస్పెండ్ చేసి జైల్లో పెట్టి వారిపై ఆర్‌ఆర్‌యాక్ట్‌ను సైతం ప్రయోగించారు. అలాగే మెదక్ మండలం బొల్లారంలోని ఓ ప్రైవేట్ గోదాముల్లో ఉన్నతాధికారులకు కనీస సమాచారం లేకుండా అప్పట్లో సివిల్ సప్లై శాఖలో విధులు నిర్వర్తించిన ఓ ఉన్నతాధికారి టన్నుల కొద్ది బియ్యం నిల్వ చేశారు. సరైన నిర్వహణ చర్యలు చేపట్టకపోవడంతో అవి ముక్కిపోయి లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా అయింది. తాజాగా మెదక్ పట్టణంలోని గోదాంలో 2021లో 95 వేల మెట్రిక్ టన్నుల బలవర్ధక బియ్యాన్ని నిల్వ చేశారు. వీటి విలువ రూ. 53.20 లక్షల వరకు ఉంటుంది. వా టిని వసతిగృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించాల్సి ఉంటుంది. కాగా వాటిని ఎప్పటికప్పుడు ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేయకపోవడం, నిల్వ కోసం కెమికల్స్‌ను కలపకపోవడం, సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బియ్యం పూర్తిగా ముక్కిపోయి పనికిరాకుండా పోయాయి. ఈ విష యం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. గతంలో సివిల్ సప్లై శా ఖలోని పలు లోసుగులను ‘సాక్షి’ కథనాలుగా ప్రచురించింది.
మరోమారు విచారణ...
మెదక్ గోదాంలో 2021లో నిల్వ ఉంచిన ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక) బియ్యానికి సంబంధించి సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు ఇప్పటికే ఓసారి విచారణ జరిగినట్లు తెలిసింది. ప్రధానంగా బియ్యం నిల్వ చేసినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే పూర్తిగా ముక్కిపోయాయని నిర్ధారించారు. ఇదే విషయమై గతేడాది అక్టోబర్‌లో అప్పటి అదనపు కలెక్టర్ సంబంధిత సివిల్ సప్లై అధికారులకు నివేదిక సైతం అందించినట్లు తెలిసింది. కాగా మరోమారు విచారణ జరిపి పూర్తి వివరాలు పంపాలని కమిషనర్ నుంచి లేఖ రావడంతో విచారణ జరిపేందుకు అధికారులు సిద్ధమతున్నారు. సివిల్ సప్లై శాఖలో విధులు నిర్వర్తించిన అధికారి నిర్లక్ష్యంతో పక్కదారి పట్టిన బియ్యంతో పాటు, ముక్కిపోయిన బియ్యం విలువ సుమారు రూ. పాతిక కోట్లపై మాటేనని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment