అర్బన్ పార్క్ అభివృద్ధికి చర్యలు
● మంత్రి కొండా సురేఖ ● డీపీఆర్ తయారు చేయాలని అధికారులకు ఆదేశం
నర్సాపూర్: హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ మాదిరిగా నర్సాపూర్ అర్బన్ పార్క్‌ను ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం నర్సాపూర్ అర్బన్ పార్క్‌లో మొక్క నాటి మాట్లాడారు. పర్యాటకులు మరింత పెరిగే విధంగా వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. అందుకు అవసరమైన డీపీఆర్ తయారు చేయాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. అడవులు, పర్యావరణాన్ని సంరక్షిస్తూనే పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడం అర్బన్ పార్క్ గొప్పతనమని కొనియాడారు. కాగా దేవాదాయ, అటవీ శాఖల సమన్వయంతో జిల్లాలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. కోతులతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. కోతులకు అన్నం, తిను బండారాలు పెట్టవద్దని హితవు పలికారు. రాయరావు చెరువులో బోటింగ్ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పలు నిర్మాణాలు నిలిచిపోయాయని, నిధులు మంజూరు చేయాలని మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్ మంత్రిని కోరారు. ఇదిలా ఉండగా మంత్రి వాచ్‌టవర్ ఎక్కి అడవి అందాలను వీక్షించారు. ఆమె వెంట కలెక్టర్ రాహుల్‌రాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, డీఎఫ్‌ఓ జోజి, ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎఫ్‌ఆర్‌ఓలు అరవింద్, అంబర్‌సింగ్, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment