వివాదాల వేదిక
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జైలు వివా దాల వేదికవుతోంది. గుండెపోటుకు గురైన లగచర్ల రైతు హీర్యానాయక్‌ను ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో బేడీలు వేసిన ఈ జైలు అధికారులు...గతంలో ఓ ప్రముఖుడైన ఖైదీకి సకల మర్యాదలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఓ పారిశ్రామికవేత్త హత్య కేసులో నిందితుడైన ఓ బడాబాబును ఈ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించగా..ఆ ఖైదీకీ ఈ జైలు అధికారుల సకల మర్యాదలు చేశారని గతంలో ఆరోపణలు వచ్చాయి. అతను కోరినప్పుడల్లా బిర్యానీలు సరఫరా చేశారని, అతనికి వీడియోకాల్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారనే ఫిర్యాదులు ఉన్నతాధికారులకు వెళ్లాయి. అలాగే కూకట్‌పల్లికి చెందిన ఓ రియల్టర్ రిమాండ్ నిమిత్తం ఈ జైలుకు రాగా ఆయనకు కూడా అన్ని మర్యాదలు చేశారనే విమర్శలు అప్పట్లో గుప్పుమన్నాయి. జైలులో పనిచేసిన ఇద్దరు అధికారుల మధ్య ముడుపుల వ్యవహరంలో తేడాలు రావడంతో ఈ బాగోతాలన్నీ బయటకు పొక్కాయనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారాలపై జైళ్ల శాఖ అప్పటి డీఐజీ మురళీబాబు అంతర్గత విచారణ కూడా చేపట్టారు. ఈ విచారణ నివేదిక ఉన్నతాధికారులకు అందజేశారు. ఇలా ప్రముఖులైన ఖైదీల సేవలో తరించే ఈ జైలు అధికారులు ఇప్పుడు గుండెపోటు వచ్చిన రైతును ఆసుపత్రికి తరలించే క్రమంలో బేడీలు వేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సంగారెడ్డి జిల్లా జైలును కొన్ని నెలల క్రితం సెంట్రల్ జైలుగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ జైలు అప్‌గ్రేడ్ అయ్యాక కూడా అదేస్థాయిలో వివాదాలు చోటు చేసుకోవడం గమనార్హం.
జైలు అధికారుల తప్పిదం..
సంగారెడ్డి జిల్లా జైలుపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు
రైతుకేమో బేడీలు..
ప్రముఖులైన వారికి సకల మర్యాదలు
గతంలో ఓ ప్రముఖుడైన ఖైదీకి
బిర్యానీ సరఫరా..!
వీడియోకాల్ కూడా చేయించినట్లు
ఆరోపణలు
అప్పట్లో ఉన్నతాధికారుల విచారణ
హీర్యానాయక్‌కు బేడీలు వేసిన ఘటనలో ఆయన్ను ఆసుపత్రికి తరలించేందుకు జైలు అధికారులు సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కానీ బాలానగర్ కేసులో నిందితులని చెబుతూ సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు గుర్తించామని ఐజీ సత్యనారాయణ గురువారం మీడియాతో పేర్కొన్నారు. ఈ తప్పిదాలపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని ప్రకటించారు. ప్రాథమిక విచారణ జరిపిన వెంటనే ప్రభుత్వం జైలర్ సంజీవరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడిన విషయం విదితమే. అయితే జైలు సూపరిండెంట్‌పై కూడా రానున్న రోజుల్లో చర్యలుండే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లగచర్ల కేసుకు సంబంధించి ఈ జైలులో ప్రస్తుతం మొత్తం 21 మంది రిమాండ్ ఖైదీలు ఉన్నట్లు తెలుస్తోంది. చర్లపల్లి జైలులో ఉన్న వీరిలో 16 మందిని సుమారు నెల రోజుల క్రితం సంగారెడ్డి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment