గ్రూప్– 2 పరీక్షలకు పటిష్ట భద్రత
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
మెదక్ మున్సిపాలిటీ: ఈనెల 15, 16 తేదీల్లో జరిగే గ్రూప్– 2 పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ భద్రత అమలు చేయనున్నట్లు ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అదనపు ఎస్పీ మహేందర్‌తో కలిసి పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి ఉండరాదని, ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ప్రచారాలకు అనుమతిలేదన్నారు. పరీక్ష సమయంలో పరిసరాల్లోని జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, మాల్ ప్రాక్టీస్ వంటి వాటికి ఆస్కారం లేకుండా, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగే విధంగా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాలో 200 మంది పోలీస్ అధికారులతో భద్రత ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన తప్పవని హెచ్చరించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలన్నారు. నిమిషం ఆలస్యమైన లోనికి అనుమతించమన్నారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే డయల్ 100లో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment