గ్రూప్– 2కు సర్వం సిద్ధం
● నేడు, రేపు పరీక్షలు ● హాజరుకానున్న 5,855 మంది అభ్యర్థులు
మెదక్ కలెక్టరేట్: నేడు, రేపు జరగనున్న గ్రూప్– 2 పరీక్షలకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు బయో మెట్రిక్ నమోదు తప్పనిసరి చేశారు. ఇందుకోసం ఇప్పటికే 44 మంది అధికారులకు శిక్షణ ఇచ్చారు. జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 200 మంది సిబ్బందితో పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. 160 సెక్షన్ అమలు చేయనున్నట్లు ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందికి అవగాహన కల్పించారు. అయితే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అరగంట ముందే గేట్లు మూసివేస్తామన్నారు. రెండు రోజుల పాటు నాలుగు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.
16 కేంద్రాలు.. 160 మంది అధికారులు
జిల్లాలో గ్రూప్– 2 పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, అబ్జర్వర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్, బయోమెట్రిక్, ఐడెంటిఫికేషన్, ఐదు రూట్లలో లోకల్, జాయింట్ రూట్ అధికారులు కలిపి మొత్తం 160 మందిని నియమించారు. అవాంతరాలను అధిరోహించేందుకు ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థులకు సరిపడా ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నట్లు డీఎం తెలిపారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ కిట్, సిబ్బంది అందుబాటులో ఉంచుతున్నారు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, అభరణాలు ధరించవద్దని అధికారులు సూచించారు. గుర్తింపు పొందిన ప్రభుత్వ ఒరిజినల్ ఐడెంటిటీ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని చెప్పారు.
అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి
అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు. హాల్‌టికెట్‌పై పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను అతికించాలి. ఎలాంటి పచ్చబొట్లు ఉన్న తొలగించుకోవాలి.
– రాహుల్‌రాజ్, కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment