స్తంభించిన విద్యా వ్యవస్థ
● కేజీబీవీ, భవిత కేంద్రాల్లో నిలిచిన బోధన ● జిల్లాలో 600 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు
తమ సమస్యల సాధన కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఈనెల 10 నుంచి విధులు బహిష్కరించి రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. నేటికీ 10 రోజులు అవుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే వీరి సమ్మె ప్రభావం విద్యావ్యవస్థపై తీవ్రంగా పడింది. విద్యాశాఖలో అనేక రకాల సేవలు పూర్తిగా స్తంభించాయి. కేజీబీవీలు, భవిత కేంద్రాల్లో బోధన కుంటుపడింది.
మెదక్‌జోన్: జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు సుమారు 600 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు అత్యధికంగా విద్యాశాఖలోనే ఉన్నారు. పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరుతో పాటు మధ్యాహ్న భోజన వివరాలను పరిశీలిస్తారు. ఇదే కాకుండా బడిబయట పిల్లలను గుర్తించి వారిని పాఠశాలలో చేర్పించడం, పాఠశాలల నుంచి విద్యార్థుల వివరాలు సేకరించి యూ డైస్‌లో నమోదు చేస్తారు. ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయులు సెలవుపై వెళ్లినప్పుడు ఆ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పడం వంటివి చేస్తుంటారు. వీరంతా సమ్మెలో ఉండడంతో ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి.
నిలిచిన కార్యకలాపాలు
● ప్రభుత్వం ఐదు నెలలుగా మధ్యాహ్న భోజన బిల్లులు విడుదల చేయకపోవడంతో వంట కార్మికులు అప్పులు తెచ్చి విద్యార్థులకు వండి పెడుతున్నారు.
● వారం రోజుల క్రితం 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ. 1.67 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.
● కానీ ఈ బిల్లుల వ్యవహారం అంతా కంప్యూటర్ ఆపరేటర్లు (సమగ్ర శిక్ష) చూస్తుండడంతో కార్మికులకు బిల్లులు అందకుండా పోయాయి.
● జిల్లావ్యాప్తంగా 19 కేజీబీవీలు ఉండగా, వాటిలో వేలాది మంది అనాథ, పేద, మధ్య తరగతి బాలికలు చదువుకుంటున్నారు.
● కాగా ఈ పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా సమగ్ర శిక్ష ఉద్యోగులే. వీరు పది రోజులుగా సమ్మెలో పాల్గొంటున్నారు.
● దీంతో బాలికలు చదువుకు దూరమవుతున్నారు. ఇప్పటికే ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ వచ్చింది.
● మార్చిలో 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభం అయ్యాయి.
● ఇలాంటి సమయంలో విద్యార్థినులకు బోధన అందకపోతే వారి భవిష్యత్ అంధకారమయ్యే పరిస్థితి ఉంది.
● మానసిక, శారీరక (దివ్యాంగులు) పిల్లలకు రోజూ ఫిజియోథెరఫీతో పాటు పలు బొమ్మలు చూపుతూ బోధించటం సమగ్ర శిక్ష సిబ్బంది విధి.
● అయితే వీరు గత పది రోజులుగా సమ్మెలో ఉండడంతో భవిత సెంటర్లు పూర్తిగా మూతపడ్డాయి.
● ఇంత జరుగుతున్నా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
● అయితే సమగ్ర శిక్ష ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని చెబుతున్నారు.
కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన
Comments
Please login to add a commentAdd a comment