ఇబ్బందులు తీరేనా?
రామాయంపేట(మెదక్): ‘గత ప్రభుత్వ హయాంలో కొత్త రెవెన్యూ డివిజన్లను అస్తవ్యస్తంగా ఏర్పా టు చేశారు. దీంతో ప్రస్తుతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీఎం, ఇతర మంత్రులతో చర్చించి వాటిని సరిచేసేలా చర్యలు తీసుకుంటా’నని ఇటీవల శాసనసభలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. నాలుగేళ్ల పాటు పార్టీలకతీతంగా పెద్దఎత్తున కొనసాగిన ఉద్యమంతో దిగివచ్చిన గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను ప్రకటించింది. నిరుపయోగంగా ఉన్న పాత హాస్టల్ భవనంలో కార్యాలయం ఏర్పాటు చేసింది. గతేడాది అక్టోబర్‌లో అప్పటి మంత్రి హరీశ్‌రావు కార్యాలయాన్ని ప్రారంభించారు. 14 నెలల క్రితం ప్రారంభమైనా ఇప్పటివరకు గెజిట్ విడుదల కాకపోవడం గమనార్హం. కార్యాలయ ఏర్పాటు కేవలం బోర్డుకే పరిమితం కాగా.. ఇప్పటికీ ఆర్డీఓ, ఇతర సిబ్బందిని నియమించలేదు. కేవలం ఒక అటెండర్ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. తూప్రాన్ ఆర్డీఓకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
బోర్డుకే పరిమితమైన రామాయంపేట ఆర్డీఓ కార్యాలయం
అసెంబ్లీలో మంత్రి ప్రకటనతో ఆశలు!
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే..
రామాయంపేటకు ఆర్డీఓ పోస్టుతో పాటు ఇతర సిబ్బంది నియామకం కాలేదు. ఉత్తర్వులు జారీ కాగానే సిబ్బంది నియామకం చేపడుతాం. అప్పటి వరకు ఇన్‌చార్జి బాధ్యతలు కొనసాగిస్తారు.
– నగేశ్, అదనపు కలెక్టర్, మెదక్
డివిజన్ పరిధిలో మండలాలు
కొత్తగా ఏర్పాటు చేసిన రామాయంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోకి రామాయంపేట, నిజాంపేట, నార్సింగి , చిన్నశంకరంపేట మండలాలను చేర్చారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భవనంలో కొంత ఫర్నీచర్ తప్పించి కంప్యూటర్లు, సిబ్బంది ఏర్పాటు గురించి పట్టించుకోలేదు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్‌ను తాత్కాలికంగా ఆర్డీఓ కార్యాలయంలో నియమించారు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వస్తున్న రైతులు తమ పనులు కాకపోవడంతో గతంలో మాదిరిగానే మెదక్ ఆర్డీఓ కార్యాలయానికి వెళ్తున్నారు. రామాయంపేటలో ఆర్డీఓ కార్యాలయం ప్రారంభమైనా తమ ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment