వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
మెదక్ కలెక్టరేట్: పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా బోధన జరగాలని, జిల్లాను రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిపేందుకు సమష్టి కృషి చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఎంఈఓలను ఆదేశించారు. గురువారం రాత్రి కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను బేరీజు వేసుకొని ఈ ఏడాది ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలుచేయాలని సూచించారు. విద్యార్థుల వారీగా వివరాలు తీసుకొని ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఈనెలాఖరులోగా సిలబస్ పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించాలని సూచించారు. చదువుతో పాటు మంచి పౌష్టికాహారం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఈఓ రాధాకిషన్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి, సంబంధిత ఎంఈఓలు పాల్గొన్నారు.
గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు
మెదక్‌జోన్/కొల్చారం(నర్సాపూర్): ఈనెల 22వ తేదీన గవర్నర్ విష్ణుదేవ్‌వర్మ మెదక్ చర్చితో పాటు కొల్చారం సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను సందర్శిస్తారని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. గురువారం చర్చిని సందర్శించి నిర్వాహకులు, అధికారులతో మాట్లాడారు. రూట్‌మ్యాప్, పార్కింగ్, చర్చి ఆవరణలో ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అనంతరం కొల్చారం బాలికల గురుకుల కళాశాలను సందర్శించారు. వంటగదిని, పరిసరాలను పరిశీలించారు. పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులకు ఆహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
‘పది’లో జిల్లాను
మొదటిస్థానంలో నిలబెట్టాలి
ఎంఈఓలతో
కలెక్టర్ రాహుల్‌రాజ్ సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment