ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు
ఆర్డీఓ జయచంద్రారెడ్డి
తూప్రాన్: సర్వేలో అధికారులు ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేకుండా నిజమైన అర్హులను గుర్తించాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి సిబ్బందికి సూచించారు. సోమవారం పట్టణ పరిధిలోని తాతపాపన్‌పల్లిలో రేషన్ కార్డుల సర్వేను మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతితో కలిసి పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. కుటుంబ సర్వేలో రేషన్ కార్డులు లేవని చెప్పిన వారికి కార్డుల జారీ కోసం విచారణ పూర్తి అయిందని తెలిపారు. కొత్త కోడలు, పిల్లలను తమ కార్డులో చేర్చమని గతంలో మీ సేవలో దరఖాస్తు చేసుకున్న 7,700 దరఖాస్తులను కూడా తమ డివిజన్ పరిధిలో విచారణ చేస్తున్నామని చెప్పారు. అంతే కాకుండా గతంలో ప్రజాపాలనలో రేషన్ కార్డు కావాలని ఇచ్చిన దరఖాస్తులను కూడా విచారణ చేస్తామని తెలిపారు. తూప్రాన్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 5,786 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. కాగా కుటుంబ సర్వేలో, ప్రజాపాలనలో ఎలాంటి దరఖాస్తు చేయని వారు ప్రస్తుతం గ్రామ, వార్డు సభలలో కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment