తెరపైకి‘ పేట’ ఆర్టీసీ డిపో!
రామాయంపేట(మెదక్): రాష్ట్రంలో కొత్తగా బస్ డిపోలను ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడంతో రామాయంపేట డిపో వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. బస్‌డిపో ఏర్పాటు కోసం సుమారు 20 ఏళ్ల క్రితం స్థానికులు తారురోడ్డును ఆనుకుని ఉన్న విలువైన ఐదెకరాల స్థలాన్ని చదును చేసి ఇచ్చారు. అప్పుడు సీఎం హోదాలో చంద్రబాబునాయుడు, అప్పటి రవాణాశాఖ మంత్రి కేసీఆర్ సదరు స్థలాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో డిపో మంజూరు చేస్తామని ప్రకటించారు. ఆమేరకు ఆర్టీసీ వారు సదరు స్థలాన్ని సంస్థ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని చుట్టూ హద్దులు ఏర్పాటుచేశారు. తరువాత ఈ విషయమై ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. దీంతో విలువైన ఈ స్థలం అన్యాక్రాంతమవుతుంది. ఆర్టీసీ అధికారులు ఏర్పాటుచేసిన హద్దులను సైతం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. డిపో మంజూరు కోసం స్థానికులు పలుమార్లు అప్పటి ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణరావుకు వినతిపత్రాలు అందజేశారు. రామాయంపేట పరిసరాల్లో నిజాంపేట, నార్సింగి, చేగుంట, చిన్నశంకరంపేట, మాసాయిపేట, కామారెడ్డి జిల్లా బిక్కనూర్, దోమకొండ, బీబీపేట, సిద్దిపేట జిల్లా పరిధిలోని భూంపల్లి తదితర మండలాలు ఉన్నాయి. రామాయంపేటలో డిపో ఏర్పాటైతే చుట్టుపక్కల ఉన్న సుమారు 100 గ్రామాలకు రవాణా సదుపాయం ఏర్పడుతుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
20 ఏళ్ల క్రితమే ఐదెకరాల అందజేత
ఇప్పటికీ మంజూరు కాని ఆర్టీసీ డిపో
మంత్రి ప్రకటనతో మళ్లీ ఆశలు
Comments
Please login to add a commentAdd a comment