దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్లో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. 2018లో ధడక్ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైంది. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు బాలీవుడ్‌కే పరిమితమైన ఈ చిన్నదానికి చాలా కాలంగా దక్షిణాది నుంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే దక్షిణాది చిత్రాల్లో నటించడానికి ఆచితూచి అడుగు వేస్తున్న జాన్వీ కపూర్ ఎట్టకేలకు తెలుగు చిత్రం ద్వారా దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న దేవర సినిమాలో జాన్వీ నటిస్తోంది.
సినిమాను విడదీయలేం..
త్వరలోనే ఈ బ్యూటీ కోలీవుడ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం లేకపోలేదు. జాన్వీ కపూర్ ఇటీవల ఒక భేటీలో మాట్లాడుతూ.. దక్షిణాది సినిమా, హిందీ చిత్ర పరిశ్రమ ఒకే బాటలో పయనిస్తున్నాయని పేర్కొంది. భాష, జాతితో సినిమాను విడదీయలేమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు డబ్బింగ్ చిత్రాలు అనేకం వస్తున్నాయని, అందువల్ల అభిమానులకు ఎంటర్టైన్మెంట్ కొరత లేదని తెలిపింది. ఇంకా చెప్పాలంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికం కావడంతో మంచి కథా చిత్రాలు, టైటిల్స్ లభిస్తున్నాయంది. వాటిని తాము సద్వినియోగం చేసుకుంటున్నట్లు చెప్పింది.
అందుకే ఈ ప్రేమాభినాలు..
తన వరకు తాను చాలెంజింగ్‌తో కూడిన కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలిపింది. పాత్రలకు ఎంతవరకు న్యాయం చేయగలనో అంతవరకు చేస్తున్నాననంది. అప్పుడే తనలోని నటన బహిర్గతం అవుతుందని పేర్కొంది. సినిమాలో మంచి డ్యాన్స్ చేయాలని, వినోదాన్ని పండించాలని కోరుకుంటున్నానంది. దక్షిణాది చిత్రాల ద్వారానే తన తల్లి పరిచయం అయ్యారని, అందుకే ఆమె ఇక్కడ ప్రేమాభిమానాలు దక్కాయని తెలిపింది. నటిగా తనకు తన అర్హతను నిరూపించుకునే సరైన సమయం ఇదేనని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment