శిఖ మల్హోత్రా.. కరోనా సమయంలో ఈమె పేరు మార్మోగిపోయింది. నటిగా సినిమాల్లో మెప్పించిన ఈ బ్యూటీ కరోనా సమయంలో అటు వైద్యులకు, ఇటు పేషెంట్లకు తనవంతు సాయం అందించింది. తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా నర్సుగా మారి సేవలందించింది. ఈ రకంగానైనా దేశానికి సేవ చేసే భాగ్యం దొరికిందని పరవశించిపోయింది. కానీ కరోనా బారిన పడి పక్షవాతానికి గురైంది. ఆత్మస్థైర్యంతో అనారోగ్యాన్నే జయించిన ఈమె ఇప్పుడు ఫిట్‌గా మారి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ప్రయాణంలో ఆమె అనుభవించిన కష్టాల కడలిని ఓసారి గుర్తు చేసుకుందాం..
తొలి సినిమా రిలీజవగానే నర్సుగా మారి
శిఖ మల్హోత్రా.. ఢిల్లీలోని వర్ధమాన్ మహవీర్ మెడికల్ కళాశాల, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో నర్సింగ్ నేర్చుకుంది. వైద్య విద్యార్థిని అయిన శిఖ నటనపై మక్కువతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. షారుక్ ఖాన్ 'ఫ్యాన్' సినిమాలో కీలక పాత్రలో నటించింది. రన్నింగ్ షాదీ, అన్‌సీన్ ఈవిల్ 2.. ఇలా తదితర చిత్రాల్లో నటించింది. 2020లో కోవిడ్ మహమ్మారి విజంభించిన సమయంలో ముంబైలో బాలాసాహెబ్ ఠాక్రే ట్రామా సెంటర్ ఆసుపత్రిలో నర్సుగా సేవలందించింది. తన తొలి చిత్రం కాంచ్లి రిలీజైన నెల రోజులకే ఆమె నర్సుగా అవతారమెత్తడంతో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. కానీ విధి బలీయమైనది.
కోవిడ్ నుంచి కోలుకునే సమయానికి బ్రెయిన్ స్ట్రోక్
మంచివారికే కఠిన పరీక్షలు అన్న చందంగా అదే ఏడాది చివర్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. కోవిడ్ నుంచి బయటపడే సమయంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీనివల్ల ఆమె శరీర కుడిభాగం పక్షవాతానికి లోనైంది. చికిత్సలో భాగంగా ఆమె స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా కొంత లావైంది కూడా! ఈ పరిణామాలతో కలత చెందిన ఆమె తిరిగి సినిమాల్లోకి రావాలన్న ఆలోచనను కూడా రానివ్వలేదట. కానీ ఇంకా ఎన్నాళ్లు బాధతో కుంగిపోవాలి? నా మీద నేనే పోరాటం చేస్తా.. మళ్లీ మునుపటిలా మారిపోతానని సంకల్పించుకుంది శిఖ.
బికినీ ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ
తన ధృడ సంకల్పం ముందు పక్షవాతం కూడా పారిపోయింది. నెమ్మదిగా అనారోగ్యం నుంచి కోలుకుంది. చావు బతుకుల సమస్య నుంచి మళ్లీ సాధారణ స్థితికి ఎలా చేరుకుందో అందరికీ తెలియజేయాలనుకుంది. అందుకే వైరల్ భయానీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా బికినీ ఫోటోలను షేర్ చేసింది. తన జర్నీ నిజంగానే ఎంతోమందికి ఆదర్శదాయకం. ఇకపోతే 2018లో తెరకెక్కిన శిఖ తొలి సినిమా కాంచ్లి కోసం 14 కిలోలు పెరిగింది నటి. ఈ చిత్రం 2020 ఫిబ్రవరి 7న రిలీజైంది. ఆ ఏడాది గూగుల్‌లో టాప్ 50 చిత్రాల్లో ఒకటిగా స్థానం సంపాదించుకుంది కాంచ్లి.
చదవండి: బిగ్‌బాస్ 7లో కార్తీక దీపం మోనిత
రూ.10 వేల కోట్ల ఆస్తికి మహారాణి.. దివాలా దెబ్బతో పతనం..
Comments
Please login to add a commentAdd a comment