కొన్ని వందల సంవత్సరాల తర్వాత మన దేశం ఎలా ఉంటుంది... సూపర్ పవర్ ఉన్న విలన్‌ని ఓ సామాన్యుడు ఎలా ఢీ కొంటాడు... వేరొకరి మెదడులోని ఆలోచనలను చిప్ సాయంతో ఇంకొకరి మెదడులోకి పెడితే... ఇవన్నీ సాధ్యమేనా అంటే.. సైన్స్‌తో సాధ్యమే. ఈ అంశాలకు సైన్స్ జోడించి, కొన్ని పిక్స్ (సినిమాలు) తెరకెక్కుతున్నాయి. ఆ ‘సైంటిపిక్స్’ గురించి తెలుసుకుందాం...
ఆరువేల సంత్సరాల తర్వాత...
కొన్ని వందల సంవత్సరాల తర్వాత భారతదేశం ఎలా ఉండబోతోంది అంటే ఊహించి, చెప్పడం కష్టం. కానీ దర్శకుడు నాగ్ అశ్విన్ ఊహించారు. వందల ఏళ్ల తర్వాత దేశం ఎలా ఉంటుంది? అని ఊహించి, ‘కల్కి 2898 ఏడీ’లో చూపించనున్నారు ఈ దర్శకుడు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ఇది. మహాభారతం ముగింపు సమయంలో మొదలయ్యే ఈ సినిమా కథ ఆరువేల సంవత్సరాల టైమ్ లైన్‌తో 2898ఏడీలో ముగుస్తుందట.
అలాగే ఈ సినిమా కథలో మైథలాజికల్ టచ్ ఉంటుంది. అందుకే ‘కల్కి 2898 ఏడీ’ అనే టైటిల్ పెట్టారని తెలిసింది. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తారు. పద్మావతి పాత్రలో దీపికా పదుకోన్, కలి పాత్రలో కమల్‌హాసన్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ దిశా పటానీ మరో లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాను అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది.
డబుల్ ఇస్మార్ట్
ఓ కిరాయి రౌడీ మెదడులో ఓ సీబీఐ ఆఫీసర్ మెదడులోని ఆలోచనలను ఓ చిప్ సాయంతో ఇన్‌జెక్ట్ చేస్తే ఏమవుతుంది? అనే కథాంశంతో రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2019లో విడుదలై, ఘనవిజయం సాధించింది. ఇప్పుడు రామ్, పూరి కాంబినేషన్‌లోనే ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రీకరణ జరుగుతోంది.
తన గతాన్ని మెల్లి మెల్లిగా మర్చిపోతున్న శంకర్ (రామ్ పాత్ర) పూర్తిగా సీబీఐ ఆఫీసర్‌గా మారిపోతాడా? ఒకవేళ సైన్స్ ప్రయోగాల ద్వారా శంకర్ తన జ్ఞాపకాలను తిరిగి పొందగలిగే చాన్స్ ఉందా? అనే అంశాలను ‘డబుల్ ఇస్మార్ట్’లో చూడొచ్చని టాక్. పూరి జగన్నాథ్, ఛార్మి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సూపర్ విలన్‌పై పోరాటం
సూపర్ పవర్స్ ఉన్న ఓ సూపర్ విలన్‌పై ఓ సామాన్యుడు చేసే పోరాటం నేపథ్యంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్ ‘మాయవన్’. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సీవీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్, సీవీ కుమార్‌ల కాంబినేషన్‌లోనే రూపొందిన ప్రాజెక్ట్ జెడ్’ సినిమాకు సీక్వెల్‌గా ‘మాయవన్’ చిత్రం తెరకెక్కుతోంది.
బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా ఈ సినిమాలో ఓ ప్రధానాంశం అని టాక్. ఈ సినిమాలో సూపర్ పవర్స్ ఉన్న విలన్ పాత్రలో నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్నారు. అతన్ని ఢీ కొనే సామాన్యుడి పాత్రను సందీప్ కిషన్ చేస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
సూపర్ యోధ
చరిత్రలో ముఖ్యమైన తొమ్మిది గ్రంథాలు దుష్టుల చేతిలో పడి దుర్వినియోగం కాకుండా ఉండేందుకు తరాలుగా సాగుతున్న ఓ యుద్ధం నేపథ్యంతో రూపొందుతున్న చిత్రం ‘మిరాయ్’. జపాన్ భాషలో మిరాయ్ అంటే భవిష్యత్ అని అర్థం. ఇందులో సూపర్ యోధ పాత్రను హీరో తేజ సజ్జా చేస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది. త్రీడీ వెర్షన్ లోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
భవిష్యత్ దర్శిని
ముగ్గురు మిత్రులకు భవిష్యత్‌ను చూపించే ఓ యంత్రం దొరికినప్పుడు వారు చేసిన పనులు ఎలాంటి పరిణామాలకు దారి తీశాయి? అనే అంశంతో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘దర్శిని’. వికాశ్, శాంతి, సత్యప్రసాద్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాకు డా. ప్రదీప్ అల్లు దర్శకుడు. ఎల్‌వీ సూర్యం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది.
సూపర్ గాళ్
యానీయా భరద్వాజ్, కబీర్ దుహాన్ సింగ్, ప్రణీతా జిజిన లీడ్ రోల్స్‌లో నటించిన టైమ్ ట్రావెల్ అండ్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ఇంద్రాణి’. స్టీఫెన్ పల్లం ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. గరిమా కౌశల్, షతఫ్ అహ్మద్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. దేశం కోసం పోరాడే ఓ సూపర్ ఉమన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది అని తెలుస్తోంది. ఈ సినిమా ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ తరహాలో తెలుగులో మరికొన్ని సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment