టైటిల్ : ఉప్పెన
జానర్ : లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా
నటీనటులు : పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల తదితరులు
నిర్మాణ సంస్థ : మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
నిర్మాతలు : నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, సుకుమార్
దర్శకత్వం : బుచ్చిబాబు సానా
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : శ్యామ్ దత్
ఎడిటర్ : నవీన్ నూలి
విడుదల తేది : ఫిబ్రవరి 12, 2021
తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మెగా’ఫ్యామిలీ ఓ ప్రత్యేకస్థానం ఉంది. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వడమే. అంతేకాదు, వాళ్లలో చాలా మంది టాలీవుడ్‌లో స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో కుర్రాడు కూడా సినీ రంగ ప్రవేశం చేశాడు. అతడే.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సుప్రీంహీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్. ‘మెగా’ఇమేజ్‌ని మోస్తూ ‘ఉప్పెన’సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు వైష్ణవ్ తేజ్. చిరంజీవి కుటుంబం నుంచి మరో వారసుడు వస్తుండటంతో మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రేక్షకులకు కూడా ‘ఉప్పెన’పై ఆసక్తి బాగా పెరిగింది. దానికి తోడు ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇన్ని అంచనాల నడుమ శుక్రవారం (ఫిబ్రవరి 12న) విడుదలైన ఈ చిత్రం ఏమేరకు ఆకట్టుకుంది? 99 శాతం కొత్తవాళ్లతో వచ్చిన ఉప్పెన.. బాక్సాఫీస్ పై విరుచుకుపడుతుందా? లేదా?, వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? అనేది రివ్యూలో చూద్దాం.
కథ
ఉప్పాడ గ్రామంలోని మత్య్సకార కుటుంబానికి చెందిన ఓ పేదింటి యువకుడు ఆశీ అలియాస్ ఆశీర్వాదం(పంజా వైష్ణవ్ తేజ్). తండ్రి చేసే చేపల వ్యాపారానికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆయనకు గ్రామ పెద్ద, వ్యాపారవేత్త శేషారాయణం(విజయ సేతుపతి) కూతురు బేబమ్మ అలియాస్ సంగీత(కృతి శెట్టి) అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి బేబమ్మను ప్రేమిస్తుంటాడు. కానీ ఈ విషయం బేబమ్మకు తెలియదు. మరోవైపు శేషారాయణంకు పరువు అంటే ప్రాణం. పరువు కోసం ఎంతటి దారుణానికికైనా పాల్పడుతాడు. ప్రాణం పోయినా పర్వాలేదు.. పరువు పోకూడదనే మూర్ఖుడు.
తన కూతురు ఎక్కడ ప్రేమలో పడి తన పరువు తీస్తుందనే భయంతో కుర్రాళ్ల గాలి తగలకుండా ఉమెన్స్ కాలేజీలో జాయిన్ చేయిస్తాడు. తన కూతురు కోసం స్పెషల్‌గా గ్రామానికి ఓ బస్సును కూడా వేయిస్తాడు. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల బేబమ్మ.. ఆశీతో ప్రేమలో పడిపోతుంది. ఓ సంఘటన వల్ల రాయణంకు తన కూతురు ప్రేమలో పడిన విషయం తెలిసి బేబమ్మను కట్టడి చేసే ప్రయత్నం చేస్తాడు. దీంతో బేబమ్మ ఆశీతో కలిసి లేచిపోతుంది. అయితే ఓ కారణం వల్ల ఆశీ.. బేబమ్మను తిరిగి రాయణంకు అప్పగిస్తాడు. తను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే బేబమ్మను ఆశీ ఎందుకు తిరిగి అప్పగించాడు? పరువు కోసం ప్రాణాలు ఇచ్చే శేషారాయణం.. తన కూతురి ప్రేమను అంగీకరించాడా లేదా? ప్రేమ దక్కించుకునే క్రమంలో ఆశి ఏం కోల్పోయాడు? చివరకు ఈ జంట ఎలా ఒక్కటైందనేదే మిగతా కథ.
నటీనటులు
చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన వైష్ణవ్ తేజ్‌కు హీరోగా తొలి సినిమా ఇది. కానీ సగటు ప్రేక్షకులు వైష్ణవ్‌కు ఇది తొలి సినిమా అని గుర్తుపట్టలేరు. అంతలా నటించాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఆశి అనే ఓ పేదింటి కుర్రాడి క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. మొదటి సినిమానే అయినా హీరో ఎంతో పరిణితితో నటించాడు. ఎమోషనల్ సీన్లను అవలీలగా చేసేశాడు. ఇక బేబమ్మ పాత్రకు ప్రాణం పోసింది కృతి శెట్టి. తొలి సినిమాయే అయినా.. చాలా అనుభవం ఉన్న హీరోయిన్‌లా నటించింది. ఇక వైష్ణవ్ తేజ్ తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర విజయ్ సేతుపతిది. శేషారాయణం అనే విలన్ పాత్రలో ఈ విలక్షణ నటుడు ఇన్వాల్వ్ అయిపోయాడు. సేతుపతి యాక్టింగ్ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు.
విశ్లేషణ
పరువు ప్రతిష్టలు, ప్రేమతో కూడిన సినిమాలు టాలీవుడ్‌లో చాలా వచ్చాయి. గొప్పింటి అమ్మాయిని పేదింటి అబ్బాయి ప్రేమించడం, పరువు కోసం ఆ ప్రేమకు హీరోయిన్ నాన్న అడ్డుపడడం. చివరకు ఎలాగోలా హీరో హీరోయిన్లు ఒక్కడవ్వడం చాలా సినిమాల్లో చూశాం. ఇలాంటి సినిమాలు సర్వసాధారణం కూడా. ఈ కథనే కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు బుచ్చిబాబు. విజయసేతుపతి లాంటి విలక్షణ నటుడిని, మెగా కుటుంబం నుంచి ఓ హీరోని తన కథకు సెలెక్ట్ చేసుకోవడంలోనే దర్శకుడు సగం విజయవంతం అయ్యాడని చెప్పొచ్చు. తొలి సినిమా అయినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టించకుండా అనుకున్న కథను కళ్లకు కట్టినట్లుగా తెరపై చూపించాడు. తనదైన స్క్రీన్‌ప్లేతో పాత స్టోరీకి ట్రీట్‌మెంట్ కాస్త డిఫరెంట్‌గా ఇచ్చాడు.
అయితే సినిమా చూస్తున్నంత సేపు పలు సినిమాల్లోని సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు కూడా రొటీన్‌గా సాగుతాయి. ఫస్టాఫ్ చూస్తే నిడివి ఎక్కువైందనే భావన కలుగుతుంది. సెకాండాఫ్‌లో కూడా చాలా సీన్లు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. క్లైమాక్స్‌లో రీవీల్ అయ్యే ఓ సీక్రెట్ మాత్రం ఈ మూవీకి హైలెట్ అని చెప్పొచ్చు. ఆశీ తండ్రి జాలయ్య సంబంధించిన సన్నివేశాలు ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు వచ్చే సన్నివేశాలు భావోద్వోగాన్ని రేకెత్తిస్తాయి. చివర్లో కృతి శెట్టి, విజయ్ సేతుపతి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాకు మరో హైలైట్ ఏంటంటే.. దేవిశ్రీ ప్రాసాద్ సంగీతం. తనదైన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమా రేంజ్‌ని పెంచేశాడు. విలన్‌కు సంబంధించిన కొన్ని సీన్లకు తన బీజియంతో ప్రాణం పోశాడు. శ్యామ్ దత్ విజువల్స్ బాగున్నాయి. నవీనూలి ఎడిటింగ్ పర్వాలేదు. సెకాండాఫ్‌లో కొన్ని చోట్లు తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తంగా ప్రేమకు సరికొత్త నిర్వచనం చెప్పి మెప్పించడంలో దర్శకుడు కాస్త సఫలమైయ్యాడనే చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్ :
విజయ్ సేతుపతి, వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి నటన
స్క్రీన్‌ప్లే
సంగీతం
మైనస్ పాయింట్
రొటీన్ స్టోరీ
ఫస్టాఫ్ సాగదీత సీన్లు
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment