వినతులు విన్నవించాం.. పరిష్కరించండి
ములుగు: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి, ఐటీడీఏలో గిరిజన దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ దివాకర, పీఓ చిత్రామిశ్రా వినతులు స్వీకరిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ప్రజలు తరలివచ్చి వినతులు సమర్పించారు. తమ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని వేడుకున్నారు.
ఓపికగా సమస్యలు వింటూ..
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్‌జీతో కలిసి ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా 49వినతులు రాగా ప్రజల గోడును ఓపికగా విన్నారు. వాటిని సమావేశానికి హాజరైన సంబంధిత శాఖల అధికారులకు అందించారు. తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు విధిగా హాజరుకావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పోరేషన్ ఈడీ తుల రవి, సీపీఓ ప్రకాశ్, డీసీఎస్‌ఓ హుస్సేని, డీఎం డీఎస్‌ఓ రాంపతి, డీసీఓ సర్దార్‌సింగ్, ఎల్డీఎం జయప్రకాశ్, డీడబ్ల్యూఓ శిరీష, ఎన్‌పీడీసీఎల్ డీఈ నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన దర్బార్‌లో..
ఏటూరునాగారం: గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు దృష్టి సారిస్తామని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో 24మంది వినతులు సమర్పించగా పీఓ స్వీకరించారు. వాటిని సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని సెక్టార్ అధికారులను ఆదేశించారు.
వినతులు ఇలా..
తాడ్వాయి మండలం భూపతిపురం గ్రామానికి చెందిన మల్కం దేవయ్య, మల్కం కమల, పోడెం దేవయ్యలు తమ వ్యవసాయభూమిలో బోరు వేయించాలని విన్నవించారు. అదే గ్రామానికి చెందిన అర్జున్, కిరణ్, ఇతరులు కలిసి బోరు మంజూరు చేయాలని, విద్యుత్ స్తంభాలు, కరెంటు వైర్లు అమర్చాలని వేడుకున్నారు. తాడ్వాయి మండలం భూపతిపురం గ్రామానికి చెందిన ప్రవళికతో పాటు 15మంది గిరిజన మహిళలు కుట్టు మిషన్లు ఇప్పించాలని పీఓను వేడుకున్నారు. ఏటూరునాగారం మండలం చింతలమోరి గొత్తికోయగూడానికి చెందిన ఇరుమయ్య విద్యుత్ సరఫరాతో పాటు గ్రామంలో చేతి పంపులు నిర్మించాలని, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని పీఓకు మొరపెట్టుకున్నారు. కన్నాయిగూడెం మండలం ఐలాపురానికి చెందిన మల్లెల లక్ష్మయ్య ఐలాపురంలోని సమ్మక్క– సారలమ్మ జాతరకు రోడ్డు నిర్మించాలని విన్నవించారు. ఇలా పలు సమస్యలపై బాధితులు పీఓకు వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీడీ పోచం, ఎస్‌ఓ సురేష్‌బాబు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ డీటీ కిశోర్, జేడీఎం కొండల్‌రావు, ఏఈ ప్రభాకర్, ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రాం అధికారి మహేందర్ పాల్గొన్నారు.
ప్రజావాణిలో వచ్చిన వినతులు ఇలా..
భూ సమస్యలు 9
డబుల్ బెడ్ రూం ఇళ్లు 2
పెన్షన్లు 5
ఉద్యోగ, ఉపాధి 4
ఇతర సమస్యలు 29
ప్రజావాణికి 49,
గిరిజన దర్బార్‌కు 24 వినతుల రాక
స్వీకరించిన కలెక్టర్ దివాకర,
పీఓ చిత్రామిశ్రా
సత్వరమే పరిష్కరించేందుకు
కృషిచేస్తామని హామీ
Comments
Please login to add a commentAdd a comment