పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి

Published Tue, Apr 16 2024 1:20 AM

-

నాగర్‌కర్నూల్‌: వేసవి సెలవులు ముగిసేలోగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కావాల్సిన మౌలిక వసతుల పనులు పూర్తిచేయాలని కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ అన్నారు. కొత్తగా ఏర్పాటైన అమ్మ ఆదర్శ కమిటీల ఏర్పాటు, పనులు చేయించే విధానంపై సోమవారం కలెక్టరేట్‌లో డీఈఓ, ఎంఈఓలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 839 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ఏర్పాటు ద్వారా మంజూరైన పనులన్నింటికీ అంచనాలు రూపొందించాలన్నారు. కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో తాగునీరు, తరగతి గదుల్లో బ్లాక్‌ బోర్డు, కిటికీలు, తలుపులు, ఫ్యాన్లు, సీసీ కెమెరాల ఏర్పాట్లతోపాటు చిన్నపాటి మరమ్మతు, టాయిలెట్లు, విద్యుత్‌ సరఫరా తదితర పనులను స్థానికంగానే పూర్తి చేయించాలన్నారు. ప్రతి పాఠశాలకు రూ.25 వేల చొప్పున విడుదల చేసిన నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా పనులన్నీ వేసవి సెలవుల కంటే ముందుగానే పూర్తిచేసేలా చూడాలన్నారు. ప్రతి పని మొదలు పెట్టే ముందు.. పూర్తయిన తర్వాత ఫొటోలను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

సీఎంఆర్‌ బియ్యం అప్పగించాలి

ప్రభుత్వానికి సీఎంఆర్‌ బియ్యాన్ని మిల్లర్లు వెంటనే అప్పగించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్‌ సీతారామారావు చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్‌ ఎఫ్‌సీఐకి 47 వేల మె.ట., బియ్యాన్ని మిల్లర్లు నిర్ణీత గడువులోగా అందించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గ్రీవెన్స్‌కు 7 ఫిర్యాదులు

నాగర్‌కర్నూల్‌ క్రైం: పోలీస్‌ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషిచేయాలని ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 7 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ చెప్పారు.

21 నుంచి క్రికెట్‌

ఉచిత శిక్షణ శిబిరం

నాగర్‌కర్నూల్‌: జిల్లాకేంద్రం నల్లవెల్లిలోని నాగర్‌కర్నూల్‌ క్రికెట్‌ అకాడమీ మైదానంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నెలరోజులపాటు ఉచిత క్రికెట్‌ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు శిక్షణ ఇన్‌చార్జ్‌లు మొహమ్మద్‌ మోసిన్‌, సతీష్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 18 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం సెల్‌ నం.98854 01701, 89193 86105లను సంప్రదించాలని సూచించారు. ఈ నెల 21న ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఉచిత క్రికెట్‌ శిక్షణ శిబిరం ప్రారంభమవుతుందన్నారు.

రాజ్యాంగాన్ని

కాపాడుకుందాం

నాగర్‌కర్నూల్‌ రూరల్‌: దేశంలో బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుందని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నదని కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో సామాజిక, తెలంగాణ గిరిజన, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ప్రజా సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ బలహీన వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి దేశ ప్రజలకు అనుకూలమైనది రూపొందించారన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే ప్రక్రియను బీజేపీ ప్రభుత్వం వేగవంతం చేస్తుందన్నారు.

Advertisement
Advertisement