11 నుంచి సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలు
కందనూలు: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సులైన డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ లోయర్, హైయ్యర్ పరీక్షలను వచ్చేనెల 11నుంచి 17వ తేదీ వరకు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు డీఈఓ ఎ.రమేష్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని, నిర్ణీత సమయంలో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ పరీక్షలకు హాజరయ్యే వారు తమ కుట్టుమిషన్లు వెంట తెచ్చుకోవాలని తెలిపారు.
శనైశ్వరుడికి
శాస్త్రోక్తంగా పూజలు
బిజినేపల్లి: నందివడ్డెమాన్‌లో శనివారం జైష్ట్యాదేవి సమేత శనైశ్వరుడికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకొని తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి ఆధ్వర్యంలో గోత్రనామార్చన, తిలతైలాభిషేకాలు చేశారు. అనంతరం శివాలయాన్ని సందర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
రైస్‌మిల్లులో తనిఖీలు
ఉప్పునుంతల: మండలంలోని ఉప్పరిపల్లి శివారులో ఉన్న ఏఎంఆర్ బాయిల్డ్ రైస్‌మిల్లులో శనివారం ఆర్డీఓ మాధవి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మూడేళ్లుగా ప్రభుత్వం సరఫరా చేసిన వరిధాన్యం, ప్రభుత్వానికి తిరిగి అప్పగించిన సీఎంఆర్ రికార్డులను పరిశీలించారు. ఎలాంటి తరుగు లేకుండా రైతుల నుంచి వరిధాన్యం కొనుగోలు చేయాలని మిల్లు యజమాని ఇంద్రసేనారెడ్డికి సూచించారు. బకాయి పడిన 8,700 క్వింటాళ్ల (30 ఏసీకే) సీఎంఆర్‌ను నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి అప్పగించాలని తెలిపారు. ఆర్డీఓ వెంట డిప్యూటీ తహసీల్దార్ కేశవ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment