శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలి
నాగర్‌కర్నూల్ క్రైం: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు సిబ్బంది కృషి చేయాలని ఐజీ రమేష్ నాయుడు అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అంతకు ముందు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఐజీకి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి ఐజీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు ప్రజలకు సత్వర న్యాయం అందించేలా చూడాలన్నారు. ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగేలా పనిచేయాలని.. ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
పోలీసు ప్రజావాణికి 7 ఫిర్యాదులు
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 7 ఫిర్యాదులు అందాయి. అందులో 3 తగు న్యాయం కోసం, 4 భూతాగాదాలపై వచ్చినట్లు తెలిపారు.
సాంకేతిక విద్య
అందించాలి
అచ్చంపేట రూరల్: గిరిజన సంక్షేమ పాఠశాలలోని విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ చందనసర్పే, డీటీడీఓ ఫిరంగి సూచించారు. సోమవారం పట్టణంలోని ఆశ్రమ పాఠశాలలో గిరిజన సంక్షేమశాఖ సహకారంతో ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ ఆధ్వర్యంలో వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు సాంకేతిక విద్య అందించేందుకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ఐసీటీ)లను తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మైండ్ స్పార్క్ ప్రోగ్రాం ప్రాముఖ్యతను వివరించారు. ఐటీడీఏ పరిధిలోని పాఠశాలలకు మైండ్ స్పార్క్‌ను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఈఐ మేనేజర్ వికాస్ ఒమర్, ఏటీడీఓలు యాదమ్మ, శ్రీనివాసులు, వెంకటయ్య, డిప్యూటీ ఈఓ శంకర్, డీవీ నాయక్, తిరుపతయ్య, హెచ్‌ఎంలు లింగస్వామి, ముత్యాలు, లింగయ్య, తిరుపతయ్య, ఆంజనేయులు, లక్ష్మణ్, శ్రీనయ్య, రాజేశ్వరి పాల్గొన్నారు.
పత్తి కొనుగోలు చేయాలని ధర్నా
చారకొండ: సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. మర్రిపల్లి సమీపంలోని జడ్చర్ల– కోదాడ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మర్రిపల్లి సమీపంలోని కాటన్ మిల్లులో ఏర్పాటుచేసిన సీసీఐ సెంటర్‌లో వారం రోజులుగా పత్తిని కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి సేకరణపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, రైతుల ధర్నాతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శంషొద్దీన్ ఘటనా స్థలానికి చేరుకొని మార్కెట్ కార్యదర్శి కిరణ్‌తో మాట్లాడారు. పత్తి కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment