సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండండి
నల్లగొండ క్రైం: సైబర్ నేరాలు–డిజిటల్ అరెస్ట్ ఫెడెక్స్ కొరియర్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరగాళ్లు మేము ముంబయి నార్కోటిక్స్ పోలీసులమని చెబుతూ మీ పేరు మీద పార్సిల్ బుక్ అయ్యిందని, అందులో డ్రగ్స్ ఉన్నాయని మీపై కేసు నమోదైందని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటన ఇటీవల నల్లగొండలో జరిగిందని తెలిపారు. ఒక బాధితురాలు తన బ్యాంకు ఖాతాలోంచి దాదాపు రూ.5 లక్షలు అపహరించారని నల్లగొండ టూ టౌన్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. బాధితులు తమకు అనుమానం వస్తే 1930కి ఫోన్ చేయాలని, నేరుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు.
20న ఇంటర్వ్యూలు
నల్లగొండ: దుబాయ్‌లో బైక్ రైడర్స్, డెలీవరీ బాయ్స్ కోసం తెలంగాణ ఓవర్‌సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ నెల 20న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎస్‌సీ పాసై 21 నుంచి 38 సంవత్సరాల వయసు కలిగి బైక్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్ : 9440050951 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి
రామగిరి(నల్లగొండ): డాక్టర్ బీఆర్.అంబేద్కర్ యూనివర్సిటీలో 2015–16 బ్యాచ్‌కు ముందు యూజీ థియరీ అండ్ ప్రాక్టికల్, ఎంబీఏ కోర్సులు చదివిన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని నల్లగొండ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ అంతటి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యూజీ, ఎంబీఏ విద్యార్థులు 30వ తేదీ లోపు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. జనవరి 4వ తేదీలోపు రూ.500 అదనపు రుసుముతో ఫీజును చెల్లించవచ్చని తెలిపారు.
30 నుంచి టైలరింగ్‌లో ఉచిత శిక్షణ
నల్లగొండ: ఈ నెల 30న టైలరింగ్ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ ఎ.అనిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్, ఫెయిల్ అయిన మహిళా అభ్యర్థులు 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు ఉండి యోగ్యతా పత్రం కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల మహిళా అభ్యర్థులు యోగ్యతా పత్రం, ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్, 2 పాస్ ఫొటోలతో నల్లగొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో హాజరు కావాలని తెలిపారు. టైలరింగ్‌లో 30 సీట్లు ఉన్నాయని, శిక్షణ 45 రోజులు ఉంటుందని ఆమె తెలిపారు. పూర్తి వివరాలకు సెల్ : 7660022517 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
రైతుల వివరాలు నమోదు చేయాలి
నాంపల్లి: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ఓపీఎంఎస్‌లో నమోదు చేయాలని జిల్లా పౌరసరఫరల అధికారి (డీఎస్‌ఓ) వి.వెంకటేశ్వర్లు సూచించారు. నాంపల్లి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. పలువు వివరా లు తెలుసుకున్నారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట పీఏసీఎస్ సీఈఓ నితీష్, సిబ్బంది ఉన్నారు.
క్షేత్రపాలకుడికి ఆకుపూజ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం శ్రీఆంజనేయస్వామికి అర్చకులు ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి నైవేద్యం సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా కొనసాగించారు. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment