మహిళల ఆర్థిక బలోపేతానికి కృషి
ఫ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ: మహిళల ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అయిటిపాములలో స్వబాగ్స్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోలార్ రీనవబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేసే ప్రక్రియను ఇటీవల కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. మహిళలు బ్యాటరీల రీచార్జ్ యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఎనర్జీ ఉత్పత్తి చేస్తే సోలార్ ల్యాబ్ కంపెనీ కొనుగోలు చేస్తుందని, దీంతో మహిళలకు ఆర్థికంగా ఆసరా అవుతుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన.. పైలెట్ ప్రాజెక్టు కింద అయిటిపాములకు చెందిన 50 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ధిక సాయం ప్రకటించారు. ఈమేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అయిటిపాములకు చెందిన మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడితే మరింత మంది దాతల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. తాను చేసిన ఆర్థిక సాయం వృథా కావొద్దని మరింత మందికి ఉపయోగపడేలా సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదని, ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా మహిళా సంఘాలకు సోలార్ ఎనర్జీ బ్యాటరీల ఏర్పాటుకు రూ. 50 లక్షలు ఆర్థికసాయం ఇవ్వడం జరిగిందన్నారు. బ్యాటరీల పరిశీలనకు జిల్లా యంత్రాంగం తరపున పరిశ్రమల శాఖ జీఎం, వ్యవసాయ శాఖ జేడీఎంను నోడల్ అధికారులుగా నియమించినట్లు చెప్పారు. కార్యక్రమంలో స్వబాగ్స్ ల్యాబ్స్ సీఈఓ సుధాకర్, మేనేజింగ్ డైరెక్టర్ సత్యసోలార్, ఎస్పీ శరత్ చంద్రపవార్, జీఎం కోటేశ్వర్‌రావు, హౌజింగ్ పీడీ రాజ్‌కుమార్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment