22న ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల ఎంపిక
మిర్యాలగూడ : దామరచర్ల మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈనెల 22న ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ ఖోఖో జట్లను ఎంపిక చేయనున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధానకార్యదర్శి నాతి కృష్ణమూర్తి తెలిపారు. శుక్రవారం ఆయన స్థానికంగా మాట్లాడుతూ ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనే ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్‌కార్డు, జిరాక్స్ కాపీలతో హాజరు కావాలన్నారు. క్రీడాకారుల వెంట సంబంధిత పీఈటీలు, ఖోఖో కోచ్‌లు రావాలని పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జనవరి 8,9,10 తేదీల్లో వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగే 57వ సీనియర్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఇతర వివరాలకు నాతి కృష్ణమూర్తి 9866368843, ఎన్.నాగేశ్వర్‌రావు 63000 85314, డి.స్వాతి 9912754498 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.
ప్రశాంతంగా
డీఈఎల్‌ఈడీ పరీక్ష
నల్లగొండ : నల్లగొండలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ) పేపర్–3 ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పరీక్ష ప్రశాంతంగా సాగింది. పరీక్షకు 40 మంది విద్యార్థులకు గాను 38 హాజరయ్యారని.. కాగా, ఇద్దరు గైర్హాజరయ్యారని డీఈఓ భిక్షపతి తెలిపారు.
తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఏపీజీవీబీ విలీనం
నల్లగొండ : తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకును విలీనం చేస్తున్నట్లు ఏపీజీవీబీ నల్లగొండ రీజియన్ రీజనల్ మేనేజర్ బి.విజయభాస్కర్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం స్థానికంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత ప్రభుత్వం ఆర్థిక సేవల శాఖ ఆదేశాల మేరకు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఏపీజీవీబీ జనవరి 1నుంచి విలీనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని బ్యాంకు ఖాతాదారులు గమనించాలన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తుందన్నారు. విలీనం కారణంగా బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు మారవన్నారు. ఏటీఎం కార్డులు, మొబైల్ బ్యాంకింగ్ సేవలు తిరిగి తీసుకోవాలని సూచించారు.
మూసీ కాల్వలకు
నేడు నీటి విడుదల
కేతేపల్లి : మూసీ ఆయకట్టులో యాసంగి పంట సాగు కోసం ఈనెల 21తేదీ నుంచి ప్రధాన కాల్వలకు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె కేతేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. శనివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న నీటి విడుదల కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరు కానున్నారని తెలిపారు. కార్యక్రమానికి మూసీ ఆయకట్టు రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సకాలంలో హాజరు కావాలని కోరారు.
మెరుగైన వైద్యం అందించాలి
చిట్యాల : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సూచించారు. చిట్యాల మండలం వెలిమినేడులోని పీహెచ్‌సీ, ఆరోగ్య ఉప కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో రికార్డులను, వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్, ల్యాబ్, మందలు నిల్వ గదిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని వైద్య సిబ్బందిని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ వేణుగోపాల్, వైద్యాధికారి డాక్టర్ ఉబ్బు నర్సింహ, హెల్త్ సూపర్‌వైజర్ లక్ష్మి, ఫార్మాసిస్ట్ హేమ, వైద్య సిబ్బంది వరలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment