ఆస్పత్రిలో నూతన బ్లాక్ నిర్మించాలి
నల్లగొండ : నల్లగొండలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కొత్త బ్లాక్ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి నూతన బ్లాక్‌ల నిర్మాణ స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. మెడికల్ కళాశాల నిర్వహించిన భవనం, గతంలో నిర్వహించిన ఓపీ బ్లాక్‌ను పూర్తిగా తొలగించి.. ఈ రెండింటి స్థానంలో నూతన భవనం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.32 కోట్లు విడుదల చేసిందన్నారు. మెడికల్ కళాశాల సామగ్రిని నూతన భవనానికి తరలించాలని, మెడికల్ కళాశాల స్థానంలో నూతన బ్లాక్‌ను నిర్మించేందుకు గోడ నిర్మించి రోగులకు ఇబ్బంది కలగకుండా పనులు ప్రారంభించాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ విభాగాన్ని రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి, ఎస్‌ఎంఐడీసీ ఈఈ జైపాల్ రెడ్డి, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుదారులు అందుబాటులో ఉండాలి
ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు సర్వే బృందాలు వచ్చినప్పుడు దరఖాస్తుదారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై శుక్రవారం ఆమె కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. ఈ నెల 31వ తేదీ వరకు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వే ఉంటుందని.. దరఖాస్తుదారులు సర్వే సిబ్బందికి అందుబాటులో ఉండి వారి ఫొటోతో సహా ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర వివరాలను సమర్పించాలని కలెక్టర్ సూచించారు. సర్వే సమయంలో దరఖాస్తుదారులు ఇతర ప్రాంతానికి వెళ్తే వాట్సాప్ ద్వారా సమాచారాన్ని తెలపడంతో పాటు దాని ఆధారాలను సర్వే బృందాల దగ్గర ఉంచుకోవాలన్నారు. సర్వే చేసే పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు దరఖాస్తుదారుడిని ఇంటిముందు నిలబెట్టి ఒక ఫొటో, ఇంటి రూఫ్ కనిపించే విధంగా మరో ఫొటో, ఇంటి లోపల భాగం ఒక ఫొటోను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాతే అప్లికేషన్లు సమర్పించాలని సూచించారు. సర్వే పూర్తయ్యేవరకు పంచాయతీ కార్యదర్శులకు సెలవులు మంజూరు చేయొద్దని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్, దేవరకొండ ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, గృహ నిర్మాణ పీడీ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment