సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దు : కలెక్టర్
దేవరకొండ : రెవెన్యూ సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేయొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె పలు అంశాలపై సమీక్షించారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని, ఎలాంటి తాత్సారం లేకుండా పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి ఫిర్యాదులతో పాటు భూ సేకరణకు సంబంధించిన వాటికి రెవెన్యూ అధికారులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో వివిధ అంశాలపై ఆమె ఆరా తీశారు. పెండింగ్‌లో ఉన్న పనులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. వివిధ ప్రాజెక్టుల కింద భూ సేకరణకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే, ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ, ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై ఆమె క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి, హరీష్‌రెడ్డి, అయ్యూబ్, సిరాజ్ తదితరులు ఉన్నారు.
సర్వేను పకడ్బందీగా చేపట్టాలి
చందంపేట : ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం చందంపేట మండలంలోని గాగిళ్లాపురం, హంక్యతండా, ముర్పునూతల గ్రామాల్లో సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. సర్వర్ సరిగా పని చేయడం లేదని పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మండలంలోని 28 పంచాయతీల్లో దాదాపు 14 చోట్ల సిగ్నల్ లేకపోవడంతో సర్వే ముందుకు సాగడం లేదని వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఆమె వెంట ఆర్డీఓ రమణారెడ్డి, స్పెషలాఫీసర్ జాకూబ్, ఎంపీడీఓ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
నల్లగొండకు నేడు మంత్రి రాక
నల్లగొండ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం నల్లగొండకు రానున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి మంత్రి బయల్దేరి 10 గంటలకు నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని వివిధ శాఖల అధికారులతో సమావేశమవుతారు. ఉదయం 11.30 గంటలకు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా శిశు కేంద్రంలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ ఎక్విప్‌మెంట్ల డొనేషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. మధ్నాహ్నం 12.30 గంటలకు క్రిస్మస్ వేడుకలకు హజరవుతారు. సాయంత్రం 4 గంటలకు ఆర్‌ఎంపీల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మంత్రి హైదరాబాద్ వెళతారు.
అండర్ పాస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు మంజూరు
సాక్షి, యాదాద్రి: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారులపై వెహికిల్ అండర్ పాస్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు మంజూరైనట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొండమడుగు – అంకుషాపూర్‌లో అండర్‌పాస్ నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచినట్లు పేర్కొన్నారు. ఘట్‌కేసర్, ఎయిమ్స్ బీబీనగర్, భువనగిరి సింగన్నగూడెంలో అండర్‌పాస్‌లకు డీపీఆర్ పురోగతిలో ఉందని తెలిపారు. ఎన్‌హెచ్–65 పై చౌటుప్పల్‌లో ఫ్లైఓవర్, వలిగొండ, చిట్యాల, పెద్దకాపర్తి వద్ద క్రాసింగ్‌ల వద్ద వీయూపీ నిర్మాణం మంజూరు చేశామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment