గ్రామానికో వీఎల్‌ఓ
భూ భారతి అమలుకు నియమించాలని ప్రభుత్వం నిర్ణయం
ఫ వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు మళ్లీ రెవెన్యూ విభాగానికి..
ఫ మాతృ శాఖకు రావాలని ఆహ్వానం
ఫ ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు నేటితో ఆఖరు
నల్లగొండ: రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తూ.. భూ పట్టాదారులకు రక్షణ కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్ రద్దు చేసి దానిస్థానంలో కొత్తగా భూ భారతి పోర్టల్‌ను తీసుకొచ్చింది. భూ భారతిని పక్కాగా అమలు చేసేందుకు ప్రతి పల్లెకూ గ్రామ స్థాయి అధికారి (వీఎల్‌ఓ)ని నియమించాలని నిర్ణయించింది. ఇందుకు గతంలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏల వ్యవస్థలు రద్దయి రెవెన్యూ శాఖ నుంచి వివిధ శాఖల్లోకి బదలాయించిన వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు తిరిగి మాతృశాఖకు రప్పించేందుకు ప్రభుత్వం వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి..
బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల రెవెన్యూ వ్యవస్థ కుప్పకూలి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారనే అపవాదు ఉంది. క్షేత్ర స్థాయిలో పనిచేసే వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థలను రద్దు చేయడం వల్ల రెవెన్యూ వ్యవస్థకు గ్రామ స్థాయిలో దిక్కు లేకుండా పోయింది. దీంతో గ్రామ స్థాయిలో భూ యజమానుల సమస్యలు పరిష్కారం లభించక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రస్తుత ప్రభుత్వం తిరిగి రెవెన్యూ వ్యవస్థను కట్టుదిట్టంగా చేసి భూ యజమానులకు రక్షణగా ఉండాలని భావించింది. అందులో భాగంగానే ధరణి వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది. దాని స్థానంలో భూ బారతిని తీసుకొచ్చింది. గతంలో చెప్పిన విధంగా వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ గ్రామాలకు ఒక గ్రామాధికారిని నియమించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలను మళ్లీ మాతృ శాఖలోకి రప్పించాలని చర్యలు తీసుకుంటోంది. రెవెన్యూ శాఖకు తిరిగి రావాలనుకునే వారినుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. రావాలనుకునే వారు సిద్ధంగా ఉన్నామని గూగుల్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. దీంతో గత పది రోజులుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. కాగా శనివారం వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
ఎంత మందిని తీసుకుంటారో..
రాష్ట్రంలో 2022 ఆగస్టు 1న వీఆర్‌ఓ, 2023 ఆగస్టు 10న వీఆర్‌ఏ వ్యవస్థలను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో జిల్లాలోని ఆయా విభాగాల్లో పనిచేస్తున్న మొత్తం 1,080 (వీఆర్‌ఓలు 390, వీఆర్‌ఏలు 690) మంది ఉమ్మడి జిల్లా పరిధిలో వివిధ శాఖలకు అటాచ్ చేశారు. ప్రస్తుతం తిరిగి వారందరినీ రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు ప్రభుత్వం విల్లింగ్ కోరడంతో దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే వీరిలో ఎంతమందిని తీసుకుంటుందో త్వరలోనే తేలనుంది.
సర్వేయర్లుగా, వీఎల్‌ఓలుగా నియమించేలా..
ప్రభుత్వం సర్వేయర్లుగా, వీఎల్‌ఓలుగా నియామకాల కోసం పాత వీఆర్‌ఓలు, వీఆర్‌ఏల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అయితే సర్వేయర్లుగా పనిచేసేందుకు ఇంటర్‌లో మ్యాథ్స్ చదివి ఉండాలి. వీఎల్‌ఓలుగా నియామకానికి ఇంటర్, డిగ్రీ పాసైన వారు ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌లో వారి పేరు, అడ్రస్, జనన తేది, విద్యార్హత, ప్రస్తుతం ఏ విభాగంలో పని చేస్తున్నారో రెవెన్యూ శాఖలోకి తిరిగి రావడానికి సిద్ధమా.. కాదా అనే వివరాలు పొందుపర్చి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment