నృసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన చేశారు. అనంతరం ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు చేశారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
డాక్టర్ పుల్లారావుకు
నేషనల్ అవార్డు
నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణానికి చెందిన ఐఎంఏ అసోసియేషన్ నాయకుడు డాక్టర్ సీహెచ్.పుల్లారావుకు నేషనల్ ప్రెసిడెంట్ అప్రిషియేషన్ అవార్డు దక్కింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సెంటినరీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన మెడికల్ కాన్ఫరెన్స్‌లో నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ దిలీప్‌బన్సాలీ, ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ రవీందర్‌రెడ్డి, డాక్టర్ జయసింగ్ చేతుల మీదుగా పుల్లారావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ కంటి చికిత్సతోపాటు ఐఎంఏ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఈ అవార్డు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ అనితారాణి, డాక్టర్లు గుత్తా సురేష్‌యాదవ్, సంజయ్‌సింగ్, ప్రసాదరావు, వసంతకుమారి, యాదయ్య, రమేష్, జయకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment