మెరుగైన వైద్య సేవలు అందించాలి
మిర్యాలగూడ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం మిర్యాలగూడ మండలంలోని ఆలగడప పీహెచ్‌సీ, మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాశ్‌నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలగడప పీహెచ్‌సీలో ప్రసవాల సంఖ్య తక్కువగా ఉండడంపై పీహెచ్‌సీ వైద్యుడు మోయిన్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ గీతావాణిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రకాశ్‌నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రభుత్వం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికీ ఎందుకు నిర్మించలేదని కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. తక్షణమే భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. తదుపరి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ధరణి పెండింగ్ సమస్యలపై సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్, తహసీల్దార్ హరిబాబుతో సమీక్షించారు. అనంతరం అవంతీపురం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని పలువురు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. జిల్లా వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులతో మాట్లాడి సంబంధిత ఏఈఓను అవంతీపురం పిలిపించారు. ధాన్యం నాణ్యత ప్రమాణాల ఆధారంగా వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో డెలివరీల సంఖ్య 400కు పెంచేలా చూడాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్‌సమరద్‌కు సూచించారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment