ఏడు నెలలుగా వేతనాల్లేవ్!
నల్లగొండ టూటౌన్: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఆర్పీ(రిసోర్స్ పర్సన్)లకు ఏడు నెలలుగా వేతనాలు అందడం లేదు. గత జూన్ నెల నుంచి డిసెంబర్ వరకు వేతనాలు ఇంతవరకు ఇవ్వకపోవడంతో తమ కుటుంబాలు గడవక ఆర్పీలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. నెలకు రూ.6వేలే ఇస్తున్నప్పటికీ ప్రతినెలా ఇవ్వడం లేదని ఆర్పీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎనిమిది మున్సిపాలిటీల్లో..
జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, నందికొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లో మెప్మా పరిధిలో 224 మంది ఆర్పీలు పని చేస్తున్నారు. వీరంతా ఆయా మున్సిపాలిటీల్లో సమభావన సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి మహిళల ఉపాధి కోసం పాటుపడుతుంటారు. ఇప్పించిన రుణాలను తిరిగి నెలనెలా చెల్లించేలా మహిళలకు అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సర్వేలకు, పథకాల దరఖాస్తుల స్వీకరణకు స్థానికంగా ఉండే ఆర్పీలకే మున్సిపల్ అధికారులు విధులు అప్పగిస్తున్నారు. ఇన్ని పనులు చేయిస్తున్న ప్రభుత్వం వీరికి కనీస వేతనం ఇవ్వకపోగా ఇచ్చే చాలీచాలని వేతనాన్ని కూడా నెలనెలా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీతాల గురించి అడిగితే తమను ఎక్కడ తొలగిస్తారనే భయంతో అధికారులను అడగలేకపోతున్నామని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు నెలనెలా కనీస వేతనం అందించాలని ఆర్పీలు కోరుతున్నారు.
మున్సిపాలిటీ ఆర్పీలు
నల్లగొండ 65
మిర్యాలగూడ 81
దేవరకొండ 18
చండూరు 10
చిట్యాల 09
హాలియా 13
నందికొండ 07
నకిరేకల్ 21
మొత్తం 224
ఫ మెప్మా ఆర్పీలకు అందని జీతాలు
ఫ ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబాలు
ఫ నెలనెలా అందించాలని వేడుకోలు
ఫ జిల్లాలో 224 మంది ఆర్పీలు
వారం రోజుల్లోగా వేతనాలు
జిల్లాలోని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఆర్పీల వివరాలను ఇప్పటికే ప్రభుత్వానికి పంపాం. వారం రోజుల్లోగా ప్రభుత్వం వేతనాలు విడుదల చేయనుంది. వెంటనే ఆర్పీల బ్యాంకు ఖాతాల్లో పడుతాయి.
– శివాజీ, మెప్మా ఉద్యోగి
Comments
Please login to add a commentAdd a comment